గత రెండు మూడు నెలలుగా జగన్ సర్కార్కు ఒకటో తేదీ ఫోబియా పట్టుకుంది. నెలాఖరు వచ్చే సరికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కత్తిమీద సాముగా మారింది. ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు రూ.5 వేల కోట్లకు పైబడి అవసరం.
ఇంత మొత్తాన్ని ప్రతినెలా సర్దుబాటు చేసుకోవడం వైఎస్ జగన్ ప్రభుత్వానికి తల ప్రాణం తోకకు వస్తోంది. మరోవైపు ఖజానాలో డబ్బుల్లేవంటూనే, సంక్షేమ పథకాలకు పెద్ద మొత్తంలో నగదు సొమ్ము బదిలీ చేస్తుండడం ఉద్యోగుల అసంతృప్తికి కారణమవుతోంది.
ఈ నేపథ్యంలో గత రెండు నెలలు ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ కేటగిరీల వారీగా నెలలో సగం రోజులు వచ్చే వరకూ వేతనం వేస్తుండడం చర్చకు దారి తీసింది. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా అందించలేని పరిస్థితి వచ్చిందని, ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలనే ప్రతిపక్షాల డిమాండ్లు ఊపందుకున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఎల్లో మీడియా గోరింతలు కొండంతలు చేయ సాగింది.
తాజాగా సెప్టెంబర్ ఒకటో తారీఖు గండం గడిచినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఉద్యోగుల వేతనాలపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా రాద్ధాంతం ఎక్కడా లేదు. గతంలో రెండో వారంలో జీతాలు అందుకున్న ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు… ఈ నెలలో ఆ ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది.
ఈ నెల మొదటి తారీఖునే మెజార్టీ ఉద్యోగులకు జీతాలు అందినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు ఆందోళన చెందకుండా మొదటి మూడు రోజుల్లోనే అందరి ఖాతాల్లో వేతనాలు వేసేలా ఆర్థికశాఖ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. దీంతో ప్రతిపక్షాలకు ఓ ఆయుధం లేకుండా పోయింది.