సమయానికి, సందర్భానికి తగిన మాటలు మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకుంటుంది. అయితే మొదటి నుంచి తెలుగుదేశం తీరు వేరేలా ఉంటుంది. సైకో పాలన, గాలికి గెలిచారు.. వంటి మాటలు మాట్లాడి ప్రజా తీర్పును అవహేళన చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆ మధ్య ఎన్నికలు వస్తే అధికారం తమకే అని డప్పుకొట్టుకున్నారు.
అదిగో ఎన్నికలు ఇదిగో ఎన్నికలు.. అంటూ తమ పార్టీ కార్యకర్తలను ఊరడించే ప్రయత్నం చేశారు. ఈ ప్రహసనాల పరంపరలో మరో మాట ఏమిటంటే.. జగన్ ప్రభుత్వం పై తిరుగుబాటుకు ప్రజలు సిద్ధం అయ్యారట!
తిరగబడితే ప్రభుత్వం తోక ముడుస్తుందని ప్రజలు తెలుసుకున్నారట. అందుకే తిరుగుబాటుకు రెడీ అయ్యారట! ఏమిటో.. చంద్రబాబు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు! ఇంతకీ ఈ తిరుగుబాటు అంటే ఏమిటో నిర్వచనాన్ని ఆయన చెప్పనే లేదు! ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడటం కామెడీ అయిపోవడం గాక మరేమిటి?
అసలు ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు అంటే మాటకు అర్థం ఉందా? తిరుగుబాట్లు, వెన్నుపోట్లు పొడిస్తే అది నేతలు చేయాలి తప్ప.. ప్రజలు చేస్తారా? మరి అలాంటిది ప్రజలు తిరుగుబాటు చేస్తారంటూ చంద్రబాబు నాయుడు తలాతోక లేకుండా మాట్లాడటం ఏమిటో మరి. ప్రధాన ప్రతిపక్ష నేత అంటే.. ఇలాంటి పోచికోలు మాటలు చెబుతూ కూర్చోవడమేనా?
ప్రభుత్వాలపై తమ తీర్పును ఇవ్వడం ఎలాగో ప్రజలకు తెలుసు. రాజ్యాంగం స్పష్టంగా ఆయుధాన్ని ప్రజల చేతిలో పెట్టింది. ఓటు అనే ఆ ఆయుధంతో ఎవరిని దించాలన్నా ప్రజలు తమ పనిని తాము కానిస్తారు. ఇది ఎవరికీ చెప్పనక్కర్లేదు. మధ్యలో ఈ తిరుగుబాటు ఏమిటో చంద్రబాబుకే తెలియాలి! ఏదో మాట వరసకు మాట్లాడినట్టా?! ఇలాంటి మాటలు మాట్లాడే కదా.. మరింత పలుచన అయ్యేది!
పనిలో పనిగా తెలుగుదేశం పార్టీ నేతల ఫోన్లను ప్రభుత్వం లాక్కొంటోందని కూడా చంద్రబాబు నాయుడు వాపోయారు. పెట్రోల్ ధరల మీద నిరసన తెలిపినందుకు చింతమనేనిని అరెస్టు చేశారట! ఎంత పని జరిగిపోయింది!