ఏపీ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పిల్లల చదువులకు సంబంధించి, ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్మెంట్ మొత్తాలను తల్లుల ఖాతాలోకి జమ చేసే పథకానికి సంబంధించి రివ్యూ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టి వేసింది. పిల్లల చదువుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లోకి వేయడానికి వీల్లేదని, వాటిని ప్రైవేట్ విద్యా సంస్థల ఖాతాల్లోకే వేయాలంటూ ఇది వరకే దాఖలైన పిటిషన్ ను హైకోర్టు సమర్థించింది. విద్యా సంస్థల ఖాతాల్లోకే ఆ డబ్బులు వేయాలంటూ ఇది వరకూ హైకోర్టు తీర్పును ఇచ్చింది.
ఈ అంశంపై రివ్యూ పిటిషన్ ను దాఖలు చేసింది ప్రభుత్వం. అయితే దీన్ని కూడా ఏపీ హై కోర్టు తిరస్కరించింది. పిల్లల చదువుల డబ్బులు ప్రైవేట్ విద్యా సంస్థల ఖాతాల్లోనే జమ చేయాలని, వారి తల్లి అకౌంట్ లోకి జమ చేయడానికి వీల్లేదని తద్వారా కోర్టు స్పష్టం చేసినట్టుగా అయ్యింది.
గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ములను ప్రైవేట్ విద్యాసంస్థ ల ఖాతాల్లోకే వేసేవారు. అయితే ఈ పథకాన్ని అడ్డం పెట్టుకుని.. కొన్ని కాలేజీలు తమదైన రీతిలో స్కామ్ లను మొదలుపెట్టాయి. ఖాళీ సీట్లను భర్తీ చేసుకోవడానికి వక్రమార్గాలను అన్వేషించాయి. ప్రభుత్వం నుంచి డైరెక్టుగా తమ ఖాతాల్లోకి డబ్బులు పడటానికి ఆస్కారం ఉంది కాబట్టి, ఖాళీ సీట్లను కూడా క్యాష్ చేసుకున్న దాఖలాలు బోలెడున్నాయి. దీంతోనే ఈ మార్పు చేసినట్టుగా ప్రభుత్వం చెప్పింది.
అయితే ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్లకు కూడా ఇది రుచించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాయి. దీని వల్ల తమకు నష్టమన్నాయి. కోర్టు విద్యా సంస్థల పిటిషన్ ను సమర్థించింది. తల్లుల ఖాతాలోకి కాకుండా, ప్రైవేట్ విద్యా సంస్థల ఖాతాలోకే డబ్బులు వేయాలని స్పష్టం చేసింది. ఇప్పుడు రివ్యూ పిటిషన్ తో కూడా అదే సందేశాన్నే ఇచ్చింది. మరి ఈ అంశంపై సుప్రీం ను ఆశ్రయించడమే మిగిలింది ఏపీ ప్రభుత్వానికి!