మిత్రపక్షాలు కూడా మోడీకి ఈ విషయంలో సపోర్ట్ చేయడం లేదు. మరోవైపు ఉత్తరాదిన మోడీ తెచ్చిన పౌరసత్వం చట్టం సవరణలకు వ్యతిరేకంగా అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. మొదటగా ఈశాన్య రాష్ట్రాలు, ఆపై పశ్చిమ బెంగాల్ అనుకుంటే.. యూపీ వరకూ అల్లర్లు చేరాయి. బిహార్ లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి నేఫథ్యంలో మోడీ, అమిత్ షాలపై మరింత ఒత్తిడి పెరుగుతూ ఉంది.
యూపీలో జరిగిన అల్లర్లతో పదహారు మంది వరకూ చనిపోయినట్టుగా తెలుస్తోంది. వారంతా దాదాపుగా ఆందోళన కారులే. మరోవైపు మోడీకీ ఇప్పటికే మిత్రపక్ష పార్టీలు ఈ విషయంలో ఝలక్ ఇచ్చాయి. బిహార్ లో ఈ చట్టం ఉండదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగస్వామి నితీష్ కుమార్ ఇప్పటికే ప్రకించారు.
ఇక పంజాబ్ లోని బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాళీదల్ కూడా మోడీ కి షాకిచ్చేలా మాట్లాడింది. పక్క దేశాల ముస్లింల పట్ల జాలి చూపాలని, మత పరమైన వివక్ష లేకుండా వారికి కూడా పౌరసత్వం ఇవ్వాలని మోడీకి అకాళీదళ్ సూచించింది!
ఇలా ఎన్డీయే భాగస్వామి పక్షాలే ఈ విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముస్లింలకు కూడా పౌరసత్వం ఇచ్చేట్టు అయితే.. దేన్నైతే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చారో అది నీరు గారిపోయినట్టే!వాస్తవానికి ఈ చట్టం పట్ల సరిహద్దు ప్రాంతాల్లోని హిందువుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది.
అస్సాంలో అలాంటి ఆందోళనే సాగింది. బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున హిందువులు అస్సాంకు తరలి వచ్చారు. బంగ్లా నుంచి తరలి వచ్చిన వారిలో ముస్లింలు కూడా ఉన్నా, హిందువులూ కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి ఇప్పటికే క్యాంపులకు తరలించారు. ఆ క్యాంపుల్లోని హిందువులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి మోడీ సర్కారు ఒప్పుకుంటోంది. అయితే ఈ నిర్ణయాన్ని అస్సామీలు వ్యతిరేకిస్తూ ఉన్నారు.
బంగ్లా మాట్లాడే హిందువులు అంతా భారతీయులుగా సెటిలయిపోతే..అస్సాంలో తమ మనుగడ కష్టం అవుతుందని, తమను వారు డ్యామినేట్ చేస్తారని అస్సామీలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకు పౌరసత్వ చట్టంపై మొదట ఆందోళనలు అక్కడ నుంచి మొదలయ్యాయి. అలా హిందువులకు పౌరసత్వాన్ని ఇవ్వడాన్ని హిందువులే వ్యతిరేకిస్తున్న పరిస్థితి అస్సాంలో నెలకొంది.
ఇక దేశీయంగా ఈ బిల్లు పట్ల భారతీయ ముస్లింలు మరీ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈ భరోసాను మోడీ ఇవ్వాల్సింది. కానీ ఆపయనేమో అల్లర్లు చేస్తున్న వాళ్లు ఒక వర్గానికి చెందిన వారే అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఒకరకమైన అభద్రతాభావం ఏర్పడిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ మంటలు ఎలా చల్లారతాయో!