ఏపీ రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాద్ధాంతానికి ఈ నెల 20వ తేదీతో క్లైమాక్స్ పడనుందని స్పష్టం అవుతోంది. ఆ రోజున ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి.. రాజధానిపై ముఖ్యమంత్రి సభలోనే స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. ఇప్పటి వరకూ రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన కమిటీలు కూడా ఆ రోజుతో తమ పనిని పూర్తి చేయనున్నాయి.
అసెంబ్లీతో పాటు శాసనమండలిని కూడా ఏపీ ప్రభుత్వం అదే రోజున సమావేశ పరచనుంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు ఉభయ సభలూ ఆ రోజున ఆమోద ముద్ర వేయడం లాంఛనంగా మారింది. శాసన సభను ఒక రోజు మరీ అవసరం అయితే రెండు రోజుల పాటు సమావేశ పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనమండలి మాత్రం ఒక రోజు సమావేశం కానుంది. ఈ సమావేశం ఉద్దేశం మూడు రాజధానుల ప్రతిపాదనకు అధికారికంగా ఆమోద ముద్ర వేయడమే అని స్పష్టం అవుతూ ఉంది.
ఇటీవలి అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి మూడు రాజధానుల ఉండవచ్చని జగన్ ప్రకటించారు. దానిపై తెలుగుదేశం పార్టీ ఎంతలా గగ్గోలు పెడుతూ ఉందో తెలుస్తూనే ఉంది.
తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, కమ్యూనిస్టు పార్టీలు కూడా చంద్రబాబుకు వంత పాడుతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఈ ఆందోళనలను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఒక వర్గం మీడియా ఈ ఆందోళనలను హైలెట్ చేస్తూ..తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాలను గురించి విడమరిచి చెబుతున్నట్టుగా ఉంది. అయినా సీఎం జగన్ మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనకు కట్టుబడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతపాదనకు అనుకూలంగా ర్యాలీలు కూడా సాగుతున్నాయి. వైసీపీ నేతల్లో మూడు ప్రాంతాల వాళ్లూ ఈ ప్రతిపాదనను పూర్తిగా స్వాగతిస్తున్నారు. అసెంబ్లీలో బలాబలాలను బట్టి మూడు రాజధానుల తీర్మానం ఆమోదం పొందడం పూర్తిగా లాంఛనమే.