జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మిత్రపక్షమైన ఏపీ బీజేపీ సీరియస్‌గా ఉంది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. జనసేనాని కేవలం ఆటలో అరటి పండు, కూరలో కరివేపాకు అనే రీతిలో బీజేపీ వ్యవహరిస్తుండడం జనసేన శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికలో పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థే పోటీలో ఉంటారని, ఆ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తమ అధినేత పవన్‌కల్యాణ్‌కు హామీ ఇచ్చారని జనసేన నాయకులు చెబుతున్నారు. అందువల్లే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భేషరతుగా బీజేపీకి మద్దతుగా నిలిచి, ఆ పార్టీ మంచి ఫలితాలు సాధించేందుకు జనసేన కారణమైందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు.
జాతీయ అధ్యక్షుడి హామీని తుంగలో తొక్కి తామే తిరుపతి ఉప ఎన్నిక బరిలో ఉంటామని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్‌రెడ్డి తదితర నాయకులు ప్రకటించడం తమకు ఆగ్రహం తెప్పిస్తోందని జనసేన నాయకులు చెబుతున్నారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా మరికొందరు ఆ పార్టీ నాయకుల ఒంటెత్తు, ఏకపక్ష నిర్ణయాలు, విధానాలపై జాతీయ అధ్యక్షుడు నడ్డాకు గత నెలలో పవన్‌కల్యాణ్ ఫిర్యాదు చేసినట్టు జనసేన నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ నేతలను ఆ పార్టీ అగ్రనేతలు ఢిల్లీకి పిలుపించుకున్నారని జనసేన నాయకులు చెబుతున్నారు. మిత్రపక్షమైన తమ అభిప్రాయాలు, ఆకాంక్షలకు కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టమొచ్చిన రీతిలో సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడారని, తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీనే నిలుస్తుందని పదేపదే చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు.
కేవలం బలపరిచే పార్టీగా మాత్రమే జనసేన గురించి ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారని, ఇంతకంటే అవమానం మరొకటి లేదని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. అయితే బీజేపీ నేతల వాదన మరోలా ఉంది. పార్టీ పెట్టి ఆరేడేళ్లు అవుతున్నా, ఇంత వరకూ జనసేనకు బూత్‌లెవల్ నాయకులు కూడా లేరని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు.
కేవలం కుల బలాన్ని చూసి పార్టీ బలంగా జనసేన నాయకులు భ్రమ పడుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అన్యాయంగా తమ నాయకులపై ఢిల్లీకి ఫిర్యాదు చేశారని, వాస్తవాలేంటో అక్కడే తేల్చుతారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీజేపీ నేతలకు అధిష్టానం ఏం చెబుతుందో అనే దానిపై ఉత్కంఠ నెలకుంది.