బాక్సాఫీస్‌పై వైరస్ కొరడా… కలల సౌధం కూల్చేసిన కరోనా
2020 మొదలవడమే తెలుగు సినిమా కాంతులీనింది. సంక్రాంతికి పోటాపోటీగా విడుదలైన భారీ చిత్రాలు రెండూ పోటాపోటీగానే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.
మహేష్‌బాబు కెరీర్లో అతి పెద్ద విజయంగా 'సరిలేరు నీకెవ్వరు' నిలిస్తే, అల్లు అర్జున్ ఖాతాలోనే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో అతి పెద్ద విజయంగా (బాహుబలియేతర చిత్రాలలో) 'అల వైకుంఠపురములో' రికార్డులు నెలకొల్పింది. సంక్రాంతికి వీటితో పాటు 'దర్బార్', 'ఎంత మంచివాడవురా' కూడా విడుదలయ్యాయి కానీ రెండు కొండలు ఢీకొనడంతో మిగిలిన సినిమాలు వాటి నడుమ నలిగిపోయాయి.
'సరిలేరు నీకెవ్వరు' సగటు మాస్ మసాలా సినిమానే అయినప్పటికీ చాలా కాలంగా మహేష్ ఈ తరహా యాక్టివ్ క్యారెక్టర్ చేయకపోవడంతో ఫాన్స్‌తో పాటు ఇతరులు కూడా ఎగబడి చూసారు. కథాపరంగా ఎలాంటి కొత్తదనం చూపించని అనిల్ రావిపూడి హాస్య రసం పండించడంలో తనకున్న నేర్పుని వాడుకున్నాడు.
మాస్‌కి ఏమి కావాలనేది బాగా తెలిసిన దర్శకుడంటూ తనకొచ్చిన పేరుని మరింత పెంచుకున్నాడు. 'అల వైకుంఠపురములో' అంతటి ఘన విజయం సాధించి రికార్డులు బద్దలు కొడుతుంటే 'సరిలేరు నీకెవ్వరు' సైడ్‌లైన్ అయిపోలేదు.
ఈ చిత్రానికి 'నాన్-బాహుబలి' రికార్డులేమీ రానప్పటికీ మహేష్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. చాలా కాలం తర్వాత వెండితెరపై మెరిసిన విజయశాంతి ఫ్యాక్టర్‌తో పాటు దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన రెండు, మూడు బాణీలు ఈ చిత్ర విజయానికి దోహదపడ్డాయి.
'అల వైకుంఠపురములో' విషయానికి వస్తే… సగటు ఫ్యామిలీ డ్రామాకు త్రివిక్రమ్ మార్కు ట్రీట్‌మెంట్ జత కలవడంతో పాటు, పండక్కి సరయిన ఫ్యామిలీ సినిమా అనిపించుకోవడంతో ఎదురే లేకపోయింది. ఈ సినిమా విడుదలవడానికి ముందే సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మ పాటలు పెద్ద హిట్ అవడంతో హైప్ తారాస్థాయికి చేరిపోయింది.
డీసెంట్ ఎంటర్‌టైనర్ ఇస్తే చాలు… మిగతాది ప్రేక్షకులు చూసుకుంటారని విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే ఈ చిత్రం త్రివిక్రమ్‌పై 'అజ్ఞాతవాసి' వేసిన మరకను తుడిచేసింది. దర్శకుడిగా మళ్లీ శిఖరాగ్రాన నిలబెట్టింది.
అల్లు అర్జున్ స్టార్‌డమ్‌ని ఎన్నో ఇంతలు పెంచేసి 'నాన్-బాహుబలి' రికార్డులు కొట్టడం కూడా అంత సులువు కాదనే రీతిన వసూళ్ల సునామీనే సృష్టించింది. త్రివిక్రమ్ చెప్పినట్టుగా ఈ చిత్ర విజయంలో అగ్రతాంబూలం తమన్ పాటలకు ఇచ్చి తీరాలి.
'ఎంత మంచివాడవురా' మేకర్లు తమ ప్రోడక్ట్‌పై అమితమైన నమ్మకం పెట్టుకుని ఇంత పెద్ద సినిమాలకు ఎదురెళ్లి 'ఇంత చెడ్డ పని ఏలరా' అనిపించుకున్నారు. కాకపోతే ఈ చిత్రం ఎప్పుడు విడుదలై వున్నా ఫలితంలో పెద్దగా మార్పులుండేవి కాదులెండి. రజనీకాంత్‌కి ఎదురవుతోన్న వరుస పరాభవాలకు మురుగదాస్ కూడా అడ్డుకట్ట వేయలేకపోయాడు. 'దర్బార్' తెరిచిన రెండు రోజులకే దర్వాజాలు బంద్ చేసుకోక తప్పలేదు.
మాస్ మహారాజా 'డిస్కో రాజా'గా వచ్చి 'డిజాస్టర్ రాజా'గా వెళ్లిపోయాడు. నాగశౌర్య కలం నుంచి వెలువడిన 'అశ్వథ్థామ' కలతనే మిగిల్చాడు. 'పెళ్లిచూపులు' నిర్మాత తనయుడు శివ కందుకూరిని ప్రేక్షకులు 'చూసీ చూడంగానే' తిరస్కరించారు.
క్లాసిక్స్ జోలికెళితే కాలుతుందని నిర్మాతగా తల పండిన దిల్ రాజుకి కూడా అనుభవంతోనే తెలిసి వచ్చింది. '96' రీమేక్ వద్దని పలువురు వారించినా కానీ గట్ ఫీలింగ్‌తో దూసుకెళ్లిన దిల్ రాజుకి 'జాను'తో ఘోర పరాజయం ఎదురయింది. సమంత జోరుకి కూడా జాను కళ్లెమేయడంతో పాటు శర్వానంద్ కష్టాలను ఇంకొంచెం పెంచింది.
రకరకాల షేడ్స్‌లో కనిపించి, విరహ వేదనతో రగిలిపోయినంత మాత్రాన 'వరల్డ్ ఫేమస్ లవర్' అనేయరని 'అర్జున్ రెడ్డి' చేదు ఫలితంతో తెలుసుకోవాల్సొచ్చింది. సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావుని నష్టాల కడలిలోకి నెట్టి దర్శకుడు క్రాంతి మాధవ్ క్రెడిబులిటీపై సాంతం మూత పెట్టేసింది.
జనవరిలో కాసుల వర్షం కురిస్తే, ఫిబ్రవరి బురద మయం అయిపోతోందని బయ్యర్లు బాధ పడుతోన్న వేళ 'భీష్మ' వచ్చింది. ఏడాదిన్నర పాటు కనిపించకుండా పోయిన నితిన్‌కి స్వీట్ సక్సెస్ దక్కింది. రెండో సినిమా గండాన్ని త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల దాటేయడంతో నిర్మాత నాగవంశీకి ఈ ఏడాదిలో హిట్టిచ్చిన అతి తక్కువ మంది నిర్మాతల పక్కన చోటు దక్కింది.
అలాగే అసలు సినిమాలే ఎక్కువ రాని ఈ యేట రష్మిక ఖాతాలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. భీష్మతో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ కనిపించిన చలనం నాని నిర్మించిన 'హిట్'తో కొనసాగింది.
రెండు నెలల్లో కొన్ని మిస్‌ఫైర్లు వున్నప్పటికీ సంక్రాంతికి వందల కోట్ల వసూళ్లు కురవడంతో పాటు, కొన్ని మంచి హిట్లు కూడా పడడంతో ఈ యేడాది మరింత గొప్పగా వుంటుందంటూ టాలీవుడ్ ట్రేడ్ కలల సౌధాలు నిర్మించేసుకుంది. తెలుగు సినీ చరిత్రలో మరో చిరస్మరణీయ సంవత్సరమవుతుందనే ఆశల పాలపొంగుపై నీళ్లు కుమ్మరించినట్టయింది.
కారు మబ్బులా కమ్ముకొచ్చిన కరోనా అన్ని పరిశ్రమలతో పాటు తెలుగు సినిమా పరిశ్రమకీ గడియ పెట్టేసింది. బాక్సాఫీస్‌కి తాళమేసేసి తొందర్లో తీసే వీల్లేకుండా తాళంచెవి ఎక్కడికో విసిరేసింది. అప్పుడు మూత పడిన సినిమా హాళ్లు కనీసం సగం నోళ్లు తెరుచుకోడానికి ఏకంగా పది నెలలు పట్టింది.
థియేటర్లు తెరుచుకోండర్రా అని ప్రభుత్వాలు దసరా ముందే అనుమతులిచ్చేసినా కానీ పిల్లి మెడలో గంట నువ్వు కట్టు అంటే, నువ్వు కట్టు అంటూ ఎవరికి వారే వెనక్కి పోవడంతో క్రిస్మస్ నాటికి కానీ మళ్లీ బొమ్మ పడలేదు. టీవీ తెరలపై లేదా ఫోన్ స్క్రీన్లపై కొత్త సినిమాలు చూసి విసిగిపోయిన సినీ ప్రియులు 'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజయితే వైరస్‌ని లెక్క చేయలేదు.
కొత్త కరోనా ఏదో వచ్చిందనే వార్తలలా వస్తూనే వున్నా కొత్త సినిమా చూడాలంటూ వచ్చి అమ్మకానికి పెట్టిన సగం సీట్లు నింపేసారు. పిల్లి మెడలో గంటయితే కట్టేసారు కనుక ఇక మళ్లీ సంక్రాంతి సందడికి ఇతర నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
బాక్సాఫీస్ కథ ఇలాగుంటే… ఈ యేడాది సినీ పరిశ్రమకు కొత్త ప్రత్యామ్నాయం దొరికింది. ఏదో సామెత చెప్పినట్టు… అన్ని ఇబ్బందులలోను చిన్న వెలుగు కనిపించింది. సినిమాలు విడుదల చేయడానికి థియేటర్లే తెరవనక్కర్లేదు… ప్రేక్షకుల ముంగిట్లోకే సినిమాను తీసుకెళితే చాలు అనుకుని దిల్ రాజు లాంటి బడా నిర్మాతలు కూడా ధైర్యం చేసేసారు.
'వి', 'నిశబ్దం' లాంటి సినిమాలను ఓటిటిలో విడుదల చేసారు. అయితే ఓటిటి ద్వారా విడుదలైన సినిమాలలో చాలా వరకు అసలు వీటిని ఆలస్యమవుతోందని విడుదల చేసారా, లేక వీలు చూసుకుని వదిలించేసుకున్నారా అన్నట్టున్నాయి. నాని, సుధీర్‌బాబు నటించిన ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా 'వి' కరోనా కారణంగా గ్రేట్ ఎస్కేప్ అయిపోయింది.
అలాగే అనుష్క, మాధవన్‌ల 'నిశబ్దం' కూడా. పాపం… అమెజాన్ ప్రైమ్‌కి నిశబ్ద రోదనే మిగిలింది. అంతగా అనుభవం లేకుండానే 'మహానటి'గా మెప్పించిన తర్వాత ఏరికోరి 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' చేసిన కీర్తి సురేష్ కథల ఎంపికలో అనుభవలేమిని చాటుకుంది. ఫ్లాపులతో కెరీర్ లాక్‌డౌన్ అయ్యే ప్రమాదంలో పడిన రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' ఓటిటిలో వచ్చింది కనుక ఇది ఫ్లాప్ కాదు తూచ్ అనుకునే అవకాశముంది.
ఓటిటిని పెద్ద సినిమాలు సరిగా వాడుకోలేదు కానీ చిన్న సినిమాలు కొన్ని మెరిసాయి. కృష్ణ అండ్ హిజ్ లీలతో సిద్ధు జొన్నలగడ్డకు డిమాండ్ పెరిగింది. మిడిల్ క్లాస్ మెలొడీస్ కుటుంబ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. కలర్‌ఫోటోకి యువతరం సపోర్ట్ దక్కింది. ఉమా మహేశ్వర ఉగ్రరూపం, భానుమతీ రామకృష్ణల ప్రణయం ఫర్వాలేదనిపించుకుంది. తెలుగు సినిమా నుంచి వచ్చిన నోటెడ్ రిలీజులు నిరాశ పరచగా, తమిళ చిత్రం 'ఆకాశం నీ హద్దురా' సూర్యని మళ్లీ ట్రెండింగ్‌లోకి తెచ్చింది.
కొత్త సంవత్సరంలో నెమ్మదిగా థియేటర్లపై ఆంక్షలు తొలగిపోయి మళ్లీ తెలుగు సినిమా బిజినెస్ పూర్వ స్థితికి చేరుకుంటుంది కానీ కరోనా టైమ్‌లో దొరికిన కొత్త రూట్లో ఇకపై కూడా తెలుగు సినిమా పయనించడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే ఓటిటిలను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందుతున్నాయి.
రిమోట్ బటన్ అంచున ప్రపంచమంత వినోదం వుండడంతో అటెన్షన్ రాబట్టడం కోసం ఫిలింమేకర్లు అవుటాఫ్ ది బాక్స్ ఆలోచించక తప్పని పరిస్థితి. థియేటర్స్‌ని దృష్టిలో పెట్టుకుని తీసే సినిమాల్లో మసాలా అంత త్వరగా మరుగున పడిపోదు కానీ ఓటిటి కోసం తీసే వాటిలో కొత్త తరం ఆలోచనలు ఎల్లలు దాటడం గ్యారెంటీ. కొత్తదనం కోరుకునే సినీ ప్రియులకు, కాంటెంట్ లవర్స్‌కు ఇది కరోనా ఇస్తోన్న పరోక్ష బహుమతి.