31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ, 15 రోజులపాటు జరిగే నిరంతర పండగ, పరోక్షంగా కోటిన్నర మందికి ఉపాధినిచ్చే ఇళ్ల నిర్మాణం.. ఇవీ నాలుగు రోజుల ముందు ఘనంగా వినిపించిన మాటలు. కట్ చేస్తే.. నేడు రాష్ట్ర రాజకీయం విగ్రహాల చుట్టూ తిరుగుతోంది.
టీడీపీ, బీజేపీ, జనసేన.. విగ్రహాల విధ్వంసాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.
చంద్రబాబు విజయనగరం యాత్రతో ప్రజల్ని మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు బీజేపీ సైతం.. అందివచ్చిన అవకాశాన్ని వదిలి పెట్టకుండా పాత విషయాన్ని తవ్వితీస్తూ ప్రభుత్వానికి మతం రంగు పులిమేందుకు సిద్ధమైంది. జనసేనాని మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
ఈ దశలో వైసీపీ కూడా అనివార్యంగా ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. విగ్రహాల ధ్వంస రచనకు కారణం చంద్రబాబేనంటూ విమర్శించారు విజయసాయిరెడ్డి… ప్రతిగా నారా లోకేష్ తండ్రి తరపున ప్రమాణం చేద్దాం సింహాద్రి అప్పన్న సన్నిధికి వస్తారా అంటూ సవాల్ విసిరారు.
ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంతలా అంటే.. సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీకి విజయనగరం వెళ్లడం కంటే.. చంద్రబాబు రాములవారిని దర్శించుకోడానికి రామతీర్థం వెళ్లడం మరింత హైలెట్ అయ్యేంతలా.
ఈ విషయంలో ప్రతిపక్షాల ట్రాప్ లో ప్రభుత్వ నేతలు పూర్తిగా ఇరుక్కుపోయారనే విషయం అర్థమవుతోంది. 15 రోజుల పండగని పక్కనపడేసి.. విమర్శలు, ప్రతి విమర్శలతో కాలం గడిపేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న నేతలు సైతం.. లబ్ధిదారుల విషయం మాట్లాడకుండా, విగ్రహాల విధ్వంసంపై స్పందిస్తున్నారు.
మొన్నటికి మొన్న ఒకేరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు.. అసలు విషయం పక్కనపెట్టి జనసేనానిపై మాటలు ఎక్కుపెట్టారు. మీడియాలో కూడా మంత్రులు పాల్గొన్న కార్యక్రమం ఏంటనేది ఒక్క ముక్క బైటకు రాలేదు.
పవన్ కల్యాణ్ ని ఏమన్నారనే విషయమే హైలెట్ అయింది. ఒక రకంగా 15 రోజుల పండగ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలేదని తెలుస్తోంది.
ప్రభుత్వం ఏ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించినా.. ప్రతిగా నిరసన కార్యక్రమాలు అదే రోజు, అదే టైమ్ కి మొదలు పెట్టడం అలవాటు చేసుకున్న టీడీపీ.. ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా రైతు యాత్రలు ప్రారంభించింది. అయితే అనుకోకుండా వారికి విగ్రహాల విధ్వంసం దొరికింది. దీంతో రైతుల్ని పక్కనపెట్టేసి, మతాన్ని నెత్తిన పెట్టుకున్నారు. మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
వీటిపై స్పందిస్తున్న వైసీపీ నేతలు, తమకి తెలియకుండానే ప్రతిపక్షాలకు ఎక్కువ స్పేస్ ఇస్తున్నారు. బృహత్తర ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తమకుతాముగా హైలెట్ అవ్వకుండా చేసుకుంటున్నారు. అలా ప్రతిపక్షాల ఉచ్చులో వైసీపీ పూర్తిగా పడిందనే చెప్పాలి.