ఇటు తెలంగాణలో కావొచ్చు, అటు ఆంధ్రాలో కావొచ్చు మంత్రులు ప్రజలకు పనికొచ్చే విషయాల కంటే పనికిమాలిన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. తెలంగాణా మంత్రులు కేసీఆర్ కు భజన చేస్తుంటారు. ఆంధ్రా మంత్రులు జగన్ కు స్తోత్ర పాఠాలు చదువుతుంటారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టిస్తుంటారు. లేనిపోని ఆలోచనలు కల్పిస్తుంటారు.
ఏపీ రాజధానిగా అమరావతి ఒక్కటే ఉండాలని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కొన్ని షరతులు, డెడ్ లైన్లు కూడా పెట్టింది. అయితే జగన్ మూడు రాజధానులు అన్నాడు కాబట్టి దానికే కట్టుబడి ఉంటాడని మంత్రులు తెగ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే జగన్ మాట తప్పని …మడమ తిప్పని నాయకుడు కదా. జగన్ ఏదైనా ఒక మాట అన్నాడంటే లేదా మాట ఇచ్చాడంటే దానికి తిరుగు ఉండకూడదు. ఈ మూడు రాజధానులు అనే జగన్ దక్షిణాఫ్రికా ఆలోచనకు మంత్రులు రకరకాల భాష్యాలు చెబుతున్నారు. ఆ క్రమంలో కోన్ని భయాలు కూడా సృష్టిస్తున్నారు.
ఇక్కడ లాజిక్కులతో పనిలేదు. తాము అనుకున్న పని జరిగి తీరాల్సిందే అనే పట్టుదలే కనబడుతోంది. హైకోర్టు తీర్పు వచ్చిన రోజునే మంత్రి బొత్స సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు ప్రజలకు అర్ధమై, కానీ భాషలో మూడు రాజధానులు తమ ప్రభుత్వ విధానమని ఘట్టిగా నొక్కి వక్కాణించాడు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కాబట్టి మూడు రాజధానులు అవసరమన్నాడు. ఇది ఆయన లాజిక్.
ఇక ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తన లాజిక్ తానూ చెప్పాడు. ఆయన లాజిక్ ఏంటయ్యా అంటే …. ఒకవేళ ఏపీ రాష్ట్ర విభజన జరిగితే మళ్లీ రాజధాని సమస్య ఎదురవుతుందని, అందుకే మూడు రాజధానుల అవసరం ఉందని చెప్పాడు. ఏపీ రాష్ట్ర విభజన జరుగుతుందనే నెగెటివ్ ఆలోచన ఎందుకు? అమరావతిని రాజధానిగా డెవలప్ చేస్తే ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందవని, దానివల్ల అసమానతలు, అసంతృప్తి పెరిగి రాష్ట్రం విడిపోతుందని, అందుకే మూడు రాజధానులు ఉంటే ఆ ప్రమాదం ఉండదని మంత్రి చెప్పాడన్న మాట. అంటే ఏపీ విడిపోతే మూడు రాష్ట్రాలుగా ఏర్పడుతుందని అనుకోవాలా ?
పోనీ మంత్రి లాజిక్ నే ఆధారం చేసుకున్నా జగన్ ప్రతిపాదించిన మూడూ రాజధానులు కావుగదా. వాటిల్లో విశాఖ ఒక్కటే రాజధాని అవుతుంది. అంటే పరిపాలన కేంద్రం అదే అవుతుంది. అప్పుడు కర్నూలులో హైకోర్టు మాత్రమే ఉంటుంది. అమరావతిలో అసెంబ్లీ మాత్రమే ఉంటుంది.
ఒకవేళ యేవో పరిణామాలు సంభవించి ఏపీ మూడు భాగాలుగా విడిపోయిందనే అనుకుందాం. మరి అప్పుడు విశాఖలో హైకోర్టు, అసెంబ్లీ కావాలి కదా. కర్నూలుకు అసెంబ్లీ, సచివాలయం కావాలికదా. అమరాతికి సచివాలయం, హైకోర్టు కావాలి కదా. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పం పాలకులకు ఉండాలి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా అభివృద్ధి కావడం లేదా ?
అలాంటి చిత్తశుద్ధి ఏపీలో అధికారంలో ఉన్న పాలకులకు కూడా ఉండాలి. అరవై ఏళ్ల పాటు అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను విభజన వల్ల కోల్పోయామని, మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు మూడు రాజధానుల అవసరం ఉండటం ఎంతైనా ఉందని కృష్ణ దాస్ అన్నాడు. పాలకులు చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే విడిపోవాలనే ఆలోచన ప్రజలకు ఎందుకొస్తుంది? ఇప్పటి నుంచే భయాలు, నెగెటివ్ ఆలోచనలు ఎందుకు?