అమరావతి రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. రాజధాని ఎంపిక హక్కు శాసన వ్యవస్థకు లేదని ఏపీ హైకోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో రకరకాల వాదనలు ముందుకొస్తున్నాయి. ఏపీ హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అసహనంతో ఉంది. శాసన వ్యవస్థకు చట్టాలు చేసే హక్కు లేదనడం ఎంత వరకు న్యాయమని, అసలు శాసన వ్యవస్థ హక్కులేంటో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. శాసనసభ చట్టాలను చేయవద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడే ఏ వ్యవస్థ అయినా పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది చర్చనీయాంశమైన అంశమన్నారు.
2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాదు అని చట్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీని వేసి రాజధాని నిర్ణయం తీసుకోవాలని చెప్పిందన్నారు. కానీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్ మంత్రి నారాయణ నేతృత్వంలో కమిటీ వేసి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందన్నారు.
కానీ అమరావతిని రాజధానిగా నిర్ణయించి, ఆ తీర్మానాన్నిపార్లమెంట్‌కు పంపలేదన్నారు. కాబట్టి హైదరాబాదే 2024 వరకు రాజధాని అని మంత్రి బొత్స తేల్చి చెప్పడం విశేషం. గత ప్రభుత్వం రాజధాని వ్యవహారం లో చట్టబద్ధంగా వ్యవహరించలేదని మంత్రి పేర్కొన్నారు.
ఒకవేళ రాజధాని మార్చాలంటే పార్లమెంట్‌లో సవరణ చేయాలని ఇటీవల హైకోర్టు తన తీర్పులో పేర్కొన్న నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బొత్స తాజా కామెంట్స్ హైకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని చేసినవే అని పలువురి అభిప్రాయం.