ఏపీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యవహార శైలిపై అధికార పక్షం మండిపడుతోంది. గవర్నర్ హరిచందన్ ప్రసంగిస్తున్నప్పుడు టీడీపీ సభ్యులు రచ్చ చేయడంపై ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ శాసనసభ ప్రాంగణం మీడియా సెంటర్ నుంచి ఆయన మాట్లాడుతూ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత హూందాగా వ్యవహరించారో చెప్పుకొచ్చారు.
ప్రజాస్వామ్యంపై టీడీపీకి ఏ మాత్రం గౌరవం లేదనేందుకు అసెంబ్లీలో గవర్నర్ పట్ల సభ్యులు వ్యవహరించిన తీరే నిదర్శనమని మండిపడ్డారు. గవర్నర్ అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని ఆయన గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు అల్లరి చేయడం ద్వారా వారి వ్యూహం ఏంటో తెలిసిపోయిందన్నారు.
ప్రజాసమస్యలపై చర్చించాలనే ఉద్దేశంతో టీడీపీ సభ్యులు అసెంబ్లీకి రావడం లేదన్నారు. ఏదో సెన్సేషన్ సృష్టించేందుకు, రాజధాని చుట్టూ ఉన్న వంద మంది బినామీలను కాపాడుకునేందుకు మాత్రమే సభకు వస్తున్నారని ఆయన ఘాటు ఆరోపణలు చేయడం గమనార్హం. కనీసం గవర్నర్ వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా రచ్చ చేయడం ఎంత వరకు సమంజసమని గడికోట నిలదీశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా బడ్జెట్ పత్రాలను చించేసి, ఆయనపైన్నే విసిరేసి దాడి చేసినట్టుగా ప్రవర్తించారని ఆరోపించారు.
బడ్జెట్ పత్రాల్లో ఏముందో కూడా చూడకుండా టీడీపీ సభ్యులు వాటిని చించిచేశారని ధ్వజమెత్తారు. గవర్నర్‌పై దాడి అంటే ఒక వ్యవస్థపై దాడి చేసినట్టే అని ఆయన అన్నారు. పదేపదే వ్యవస్థల గురించి మాట్లాడే టీడీపీ సభ్యులు ఇవాళ తమ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి కోరారు.
పార్టీ పరంగా ద్వేషం ఉంటే, లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అనుకుంటే తగినంత సమయం ఇస్తామని కూడా చెబుతున్నామన్నారు. కనీసం బీఏసీ సమావేశం కూడా జరగకుండా అసెంబ్లీలో టీడీపీకి చెందిన ప్రతి సభ్యుడు ఫ్రీప్లాన్‌గా చేసిన అనుచిత ప్రవర్తన బాధాకరమన్నారు. గవర్నర్ గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం చేస్తే, అందుకు విరుద్ధంగా ప్రతిపక్షం హీనంగా ప్రవర్తించిందని ఆయన మండిపడ్డారు.
ప్రతిపక్ష నేతగా జగన్ నాడు ఎంతో హూందాగా వ్యవహరించారని గుర్తు చేశారు. కానీ నేడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న టీడీపీ హూందాగా వ్యవహరించలేదని ఆరోపించారు. సంస్కార హీనులుగా వ్యవహరించడం టీడీపీ నేతలకు ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై టీడీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.
టీడీపీ నేతలు రోజురోజుకూ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సభను, వ్యవస్థలను అగౌరవపరచవద్దని టీడీపీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.