పవన్ సంచలన ప్రకటన చేయబోతున్నారా?

ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభకు సన్నాహాలు జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో సభ పెట్టాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. మహానాడు టైప్ లో బిల్డప్ ఇవ్వాలనుకుంటున్నారు. అయితే ఆ సభలో పవన్…

ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభకు సన్నాహాలు జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో సభ పెట్టాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. మహానాడు టైప్ లో బిల్డప్ ఇవ్వాలనుకుంటున్నారు. అయితే ఆ సభలో పవన్ కీలక ఉపన్యాసం ఇస్తారంటూ ముందునుంచే నాదెండ్ల ఊదరగొడుతున్నారు. 

ఇంతకీ పవన్ ఏం మాట్లాడతారు. బీజేపీతో తెగదెంపులపై హింట్ ఇస్తారా..? జగన్ పై మరోసారి రెచ్చిపోతారా..? బాబు స్నేహాన్ని కోరుకుంటారా..? లేదా కాపు నాయకులందర్నీ ఓ చోట చేర్చి షాకిస్తారా..? అసలేం జరగబోతోంది..?

ఆవిర్భావ సభ పేరుతో బల ప్రదర్శన..

పవన్ కల్యాణ్ ఏపీలో ఎక్కడికి వెళ్లినా భారీ స్థాయిలో స్వాగతం మాత్రం గ్యారెంటీ. అది సినిమా హీరోగా ఆయనపై అభిమానమా, లేక నాయకుడిపై ఆయన కార్యకర్తల ఎలివేషనా అనేది క్లారిటీ లేదు. ఓ రకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ సిని హీరోగానే జనం ఆదరిస్తుంటారు. కానీ ఆయన కనపడగానే సీఎం సీఎం అంటూ గోల చేస్తుంటారు. 

ఈ గోల నచ్చకే ఆయన గతంలో తాను పవర్ లేని స్టార్ ని అని, ఇక సీఎం స్లోగన్లు ఎందుకని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ అభిమానుల ఉత్సాహం తగ్గలేదు. ఈనెల 14న మంగళగిరి నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ సభ జరగాల్సి ఉంది. దానికి స్థల పరిశీలన ఇతర ఏర్పాట్లలో నాదెండ్ల తల మునకలై ఉన్నారు. 

ఇప్పటికే ప్రభుత్వం తమకు సహకరించట్లేదని దెప్పిపొడుస్తున్నారు. కానీ సభ కోసం జిల్లాల నుంచి భారీగా జన సమీకరణకు సమాయత్తమవుతున్నారు నాయకులు. జిల్లా అధ్యక్షులపై ఆ భారం మొత్తం పెట్టారట. ఇటీవల జనసేన క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ సభకు హాజరయ్యేలా చూడాలని ఆదేశాలిచ్చారట పవన్. భారీ స్థాయిలో ఈ ఈవెంట్ నిర్వహించాలని చెబుతున్నారట.

కీలక ప్రకటన ఏంటో..?

జనసేన సభ టైమ్ కి ఏపీ బడ్జెట్ వచ్చేస్తుంది. సహజంగా దానిపై కామెంట్లు ఉంటాయి. ఇక ఈ సభలో పవన్ భవిష్యత్ కార్యాచరణపై కూడా నాయకులకు హింట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంటే బీజేపీతో ఉండాలా, లేక టీడీపీతో వెళ్లాలా.. లేక అందరూ కలసి ముందుకెళ్లాలా అనేది ఇక్కడే డిసైడ్ అయ్యే అవకాశముంది. 

భీమ్లా నాయక్ రిలీజ్ రోజు చంద్రబాబు, చినబాబు సహా టీడీపీ నాయకులు చేసిన హడావిడి, ప్రభుత్వ నిబంధనలు కూడా సభా ముఖంగా చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అదే టైమ్ కి సినిమా టికెట్లపై కొత్త నిబంధనలు కూడా వచ్చేస్తాయి కాబట్టి.. పవన్ తన కడుపుమంటను మరింతగా ఎలివేట్ చేసుకోవచ్చు.

పవన్ ప్రకటన ఎలా ఉంటుందో వేచి చూడండి అంటూ నాదెండ్ల ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నారంటే ఏదో ఒక సంచలనం ఉండే ఉంటుందనేది జనసైనికుల ఆశ, ఆలోచన. 

పార్టీతో సంబంధం లేకుండా ఉన్న కాపు నాయకులు కొందరు జనసేనలో చేరే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈనెల 14న పవన్ కొత్త విషయాన్ని చెబుతారా, లేక పాత ప్రవచనాలే వినిపించి 2024లో సత్తా చూపిస్తామంటూ ముగిస్తారా అనేది వేచి చూడాలి.