ఉత్తరాంధ్రా మీద టీడీపీ బెంగ… ?

చంద్రబాబుకు ఆయన టీడీపీకి ఉత్తరాంధ్రా అంటే పెట్టని కోటగానే ఎపుడూ ఉంటూ వచ్చింది. ఉత్తరాంధ్రా జిల్లాలు 1983 నుంచి టీడీపీకి జై కొడుతూ వచ్చాయి. వైఎస్సార్ టైమ్ లో కూడా బాగానే సీట్లు ఇక్కడ…

చంద్రబాబుకు ఆయన టీడీపీకి ఉత్తరాంధ్రా అంటే పెట్టని కోటగానే ఎపుడూ ఉంటూ వచ్చింది. ఉత్తరాంధ్రా జిల్లాలు 1983 నుంచి టీడీపీకి జై కొడుతూ వచ్చాయి. వైఎస్సార్ టైమ్ లో కూడా బాగానే సీట్లు ఇక్కడ టీడీపీ తెచ్చుకుంది.

అలాంటిది 2019 ఎన్నికల వేళ మాత్రం మొత్తానికి మొత్తం సీట్లలో అరడజన్ తప్ప అన్నీ ఫ్యాన్ పార్టీ ఎగరేసుకుపోయింది. దాంతో పాటు విశాఖను పరిపాలనా రాజధానిగా వైసీపీ ప్రతిపాదించింది. అయితే అమరావతే ఏకైక రాజధాని అని టీడీపీ ఈ రోజుకీ నినదిస్తోంది. ఆ మేరకు కోర్టుకు కూడా వెళ్ళి మూడు రాజధానులను అడ్డుకుంది అన్న అపనిందను కూడా మోస్తోంది.

దాంతో అర్జంటుగా ఉత్తరాంధ్రాలో సైకిల్ కి జోరు పెంచాలని టీడీపీ భావిస్తోందని అంటున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయకత్వాన టీడీపీ బస్సు యాత్రను తొందరలోనే ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. మరి ఈ మూడు జిల్లాలలో టీడీపీ అధినేత బస్సు యాత్ర సందర్భంగా విశాఖ రాజధాని విషయంలో బాబు ఏం చెబుతారో చూడాలని వైసీపీ నేతలు అంటున్నారు.

మరో వైపు టీడీపీకి ఎపుడూ ఉన్న పడికట్టు పదాల లాంటి ఆర్ధిక రాజధాని, కల్చరల్ క్యాపిటల్ వంటివాటిని చెప్పి ఉత్తరాంధ్రాలో టీడీపీ వైపు జనాలను తిప్పుకునేలా ప్లాన్ వేస్తున్నారు అంటున్నారు. మొత్తానికి నిన్నటి దాకా అమరావతి అన్న తెలుగుదేశం ఇపుడు ఉత్తరాంధ్రా మీద ఫోకస్ పెడుతోంది అంటే రాజకీయంగా ఈ జిల్లాలే కీలకం అని అర్ధమవుతోంద‌ని అంటున్నారు.