కరోనా కష్టకాలంలో దేశంలో చాలా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను కట్ చేశాయి. తెలంగాణ, కేరళ తో సహా అనేక రాష్ట్రాలు తమ ఉద్యోగులకు 50 శాతం స్థాయి జీతాలను మాత్రమే ఇస్తామని ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం కూడా అదే విషయాన్ని మొదట ప్రకటించింది. రెండు నెలల పాటు ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం జీతాన్ని ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది. ఆ తర్వాత వందశాతం చెల్లింపులు చేస్తూ ఉంది.
ఇప్పటికీ అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు సెలవుల్లోనే ఉన్నారు. టీచర్లతో సహా అనేక రంగాలకు చెందిన ఉద్యోగులు కరోనా వల్ల విధులు నిర్వహించడం లేదు. వాళ్లంతా ఇళ్లకే పరిమితం. అయినా ప్రభుత్వం ఇప్పుడు వంద శాతం జీతాలను చెల్లిస్తూ ఉంది.
ఇలాంటి క్రమంలో ఏపీ ప్రభుత్వం కట్ చేసిన 50 శాతం జీతాల విషయంలో కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఈ విషయంలో ప్రభుత్వం ముందే క్లారిటీ ఇచ్చింది. కట్ చేస్తున్న జీతాలను ముందు ముందు చెల్లించబోతున్నట్టుగా చెప్పింది. కొన్ని రాష్ట్రాలు అయితే కట్ చేసిన జీతాలను మరిచిపోవాలని స్పష్టం చేశాయి. 50 శాతం జీతాలను మాత్రమే పే చేసి, మిగిలిన జీతాలను ఇచ్చేది లేదని తేల్చాయి. ఏపీ ప్రభుత్వం మాత్రం అంతా కోలుకున్నాకా పెండింగ్ జీతాన్ని ఇస్తామంటూ హామీ ఇచ్చింది.
అయితే ఈ విషయంలో హై కోర్టు ఒకింత సంచలన తీర్పును ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు కట్ చేసిన జీతాలను చెల్లించి తీరాలని, అది కూడా 12 శాతం వడ్డీని కలిపి చెల్లించాలని తీర్పును ఇచ్చేసింది! కొన్ని రాష్ట్రాల హై కోర్టులు ఇలాంటి పిటిషన్లను కొట్టి వేశాయి. కట్ చేసిన జీతాలను చెల్లించమంటూ కోర్టుకు ఎక్కిన వారికి మొట్టికాయలు వేసి పంపించాయి. అయితే ఏపీ హై కోర్టు మాత్రం కట్ చేసిన జీతాలకు తోడు వడ్డీని కూడా చెల్లించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది!
కరోనా -లాక్ డౌన్ ల వల్ల ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. వేల కోట్ల రావాల్సిన చోట్ల.. వంద, నూటా యాభై కోట్ల రూపాయల ఆదాయాలు ప్రభుత్వాలకు వచ్చాయి. అలాంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను తగ్గించడం పట్ల సామాన్య జనాలు ఎవ్వరూ ఫీల్ కావడం లేదు. ఎందుకంటే.. ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలను ఇచ్చేది సామాన్య ప్రజల డబ్బునే కదా. అందులోనూ.. టీచర్లు వంటి వాళ్లైతే విధులు నిర్వర్తించి నెలలు గడిచిపోయాయి. అలాంటప్పుడు వాళ్లకు ఎందుకు వందకు వందశాతం జీతాలు ఇవ్వాలనేది సామాన్యులు వేసే ప్రశ్న. అది కూడా రెండు మూడు నెలలు వాళ్లకు 50 శాతం జీతాలు ఇచ్చినంత మాత్రాన వాళ్లకు వచ్చే తీవ్రనష్టాలు కూడా ఏమీ ఉండవు.
అవతల వీధి వ్యాపారులు, చిన్న చిన్న హోటళ్లను నడుపుకునే వాళ్లు బజారున పడ్డారు. అలాంటి వాళ్లకు ప్రభుత్వాలు ఇప్పుడు ఏమైనా చేస్తే.. వాళ్లకు వేళకింత బువ్వ అందుతుందనేది సామాన్యుల భావన.
ఇలాంటి పరిస్థితుల్లో.. ఏపీ హై కోర్టు ప్రభుత్వ ఉద్యోగులపై అపారమైన జాలిని చూపించింది. వాళ్లకు వడ్డీలను కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ విషయంలో స్పందిస్తూ.. తమకు వడ్డీలు అవసరం లేదని ప్రకటించింది. ఈ విషయంపై కోర్టులో రివ్యూ పిటిషన్ ను వేయబోతున్నట్టుగా పేర్కొంది. వడ్డీలు అవసరం లేదని, పెండింగ్ అమౌంట్లను మాత్రం చెల్లిస్తే చాలని ఆ ఉద్యోగ సంఘం కోర్టును కోరనుందట!మొత్తానికి ఉద్యోగులు కూడా ఆశించనంత స్థాయిలో వాళ్లకు న్యాయం చేసేసినట్టుగా ఉంది ఏపీ హై కోర్టు!