ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రభుత్వ స్థలం కొని ఇళ్లు నిర్మించుకున్న వాళ్లకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. అసైన్డ్ లేదా డీకేటి స్థలాలు కొని, అందులో ఇళ్లను నిర్మించుకున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఆ తర్వాత అగ్రిమెంట్లపై చేతులు మారిన ఉదంతాల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు.
అలాంటి వాళ్లకు తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ భలే చాన్స్ అని చెప్పొచ్చు. అలాంటి వాళ్లకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో హక్కులు కల్పించేందుకు మంచి నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ప్రభుత్వం స్థలం కేటాయించి పదేళ్లు పూర్తియితే చాలు సంపూర్ణ హక్కులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021, సెప్టెంబర్ 17 నాటికి ప్రభుత్వం స్థలం కేటాయించి వుంటే, ఒకవేళ విక్రయించినా, సదరు కొనుగోలుదారులు తగిన డాక్యుమెంట్స్ సమర్పిస్తే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
వాటిపై తహశీల్దార్ విచారణ జరిపి, సంతృప్తి చెందితే సంబంధిత లబ్ధిదారులకు యాజమాన్య హక్కు కల్పిస్తారు. సదరు భూమిని నిషిద్ధ జాబితా నుంచి కూడా తప్పిస్తారు.
ఆ స్థిరాస్తికి అన్ని పన్నులనూ దరఖాస్తుదారులే చెల్లించాలి. అనంతరం ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతర పత్రం లేకుండానే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేస్తారు.