ఎల్లో మీడియా, దాని ప్రత్యామ్నాయ మీడియా మొత్తం టార్గెట్ వైఎస్ కుటుంబమే. మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ నేపథ్యంలో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. సీబీఐ వ్యూహాత్మకంగా వాంగ్మూలాలను ఎల్లో మీడియాకు లీక్ చేయడం, అందులోని అంశాలను పట్టుకుని… హత్యతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సంబంధం ఉందన్న విషాన్ని నింపేందుకు ఓ వర్గం మీడియా శక్తివంచన లేకుండా పని చేస్తోంది.
ఇదే సందర్భంగా ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టే క్రమంలో జగన్ మీడియా సాక్షి మాజీ మంత్రి వైఎస్ వివేకా కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. ఇవాళ సాక్షిలో వివేకా హత్యపై కుమార్తె సునీత, భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనం రాశారు. ఇందులో తండ్రి హత్యను ఛేదించడంలో కుమార్తె డాక్టర్ సునీత చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రశ్నించడం గమనార్హం.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలను అడ్డుపెట్టుకుని సాగుతున్న సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు బలపడుతున్నాయని ఆ కథనంలో పేర్కొన్నారు. కేవలం తమ రాజకీయ, ఇతరత్రా ప్రయోజనాల కోసమే ఈ కేసును ఉపయోగించుకోవాలని కుమార్తె, అల్లుడు ప్రయత్నిస్తున్నారంటూ సాక్షి కథనం పేర్కొంది.
నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సోదరుడు అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారని ఎలా చెప్పారని సాక్షి పత్రిక ప్రశ్నించింది. ఈ సందర్భంగా వివేకా వ్యక్తిగత విషయాలను కూడా తెరపైకి తేవడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
వివేకా జీవించి ఉన్నంత వరకూ ఆయనకు రెండో భార్య ఉన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన హత్యానంతరం సీబీఐ విచారణపై అధికార పార్టీకి అనుమానాలు తలెత్తడంతో మీడియాకెక్కడం గమనార్హం. షమీమ్ అనే మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తడాన్ని సాక్షి ప్రతిక ప్రధానంగా ప్రస్తావించింది.
షమీమ్‌కు రూ.10 కోట్లు ఇవ్వాలన్న వివేకా నిర్ణయాన్ని ఆయన భార్య సౌభాగ్యమ్మ, సునీత, అల్లుడు ఎన్.రాజశేఖరరెడ్డి వ్యతిరేకించారని రాసుకొచ్చారు. కుటుంబ బ్యాంకు ఖాతాలకు సంబంధించి వివేకానందరెడ్డికి చెక్ పవర్ లేకుండా చేశారని ఈ కథనంలో పేర్కొనడం విశేషం. ఈ అంశాలపై సునీత ఎందుకు స్పందించడం లేదని సాక్షి పత్రిక ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అటు ఎల్లో మీడియా సీబీఐ వాంగ్మూలాలను ఆధారం చేసుకుని రోజువారీ సీరియల్ కథనాలను రాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏకంగా జగన్‌ను విచారించాలని, హత్యలో ఆయన పరోక్ష ప్రమేయం ఉందంటూ ఆరోపణలు సరేసరి.
ఎటొచ్చి ఎల్లో మీడియా, దాని ప్రత్యామ్నాయ మీడియాలకు వైఎస్ కుటుంబమే టార్గెట్ అయ్యిందని తాజా కథనాలే నిదర్శనం. అంతిమంతా వైఎస్, ఆయన ప్రియమైన తమ్ముడు వివేకా పిల్లలే బలి పశువులు. వివేకా హత్యలో సూత్రధారులు, పాత్రధారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.