మాట్లాడితే ఏపీ అప్పుల పాలు అవుతోంది. అభివృద్ధి ఆగిపోయింది అంటూ గొంతు చేయడం తమ్ముళ్ళకు అలవాటే. ఇక ఈ ధోరణి ఇంకాస్తా ముందుకెళ్ళి నవరత్నాలను నవ రంధ్రాలు అంటూ కూడా గేలి చేయడం దాకా వెళ్ళిపోయింది.
అప్పులు చేసి సంక్షేమ పధకాలకు వెచ్చిస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నా కూడా ఎగతాళీ చేయడమే టీడీపీ నేతలకు వ్యవహారమైపోయింది. దీని మీద వైసీపీ మంత్రి సీదరి అప్పలరాజు గట్టిగానే గర్జించారు.
పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు మీకు నవరంధ్రాలుగా కనిపిస్తున్నాయా అంటూ ఆగ్రహించారు. దమ్ముంటే నవరత్నాలను ఆపేస్తామని టీడీపీ నేతలు చెప్పి ఎన్నికలకు వెళ్ళాలని సవాల్ చేశారు.
అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా, వసతి దీవెన లాంటి పధకాలను మేము అధికారంలోకి వస్తే అమలు చేయలేమని జనాలకు చెప్పగలరా అంటూ టీడీపీ తమ్ముళ్లను ప్రశ్నించారు.
ఈ రకంగా చెప్తే జనాల తీర్పు ఎలా ఉంటుందో తమ్ముళ్లకు బాగా తెలుసు అంటూ మంత్రి గారు బాగానే క్లాస్ పీకారు. ఇక ప్రతీ ఒక్క అభివృద్ధిని కోర్టుల ద్వారా అడ్డుకుంటూ టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను అంతా గమనిస్తున్నారని కూడా ఆయన అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ఇళ్లపట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ఇలా ప్రతి సందర్భంలో కోర్టులకు వెళ్లి ఆపించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఘాటుగానే విమర్శించారు. ఎవరెన్ని చేసినా తమ సంకల్పాన్ని అడ్డుకోలేరని, తాము అనుకున్నది చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.