ఉద్యోగ సంఘాల హెచ్చరికతో ఏపీ సర్కార్ దిగొచ్చింది. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ముందుకొచ్చింది. చర్చలకు రావాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులను ఆహ్వానించడం గమనార్హం. ఇది ఉద్యోగులు సాధించిన మొదటి విజయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మను మంగళవారం ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను వారి ముందు పెట్టారు.
సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోకపోతే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే ఏపీ సర్కార్ వైఖరిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలవడం ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పుగా పరిగణించొచ్చు.
ఇవాళ్టి చర్చల్లో ఒకటో తేదీకే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాల చెల్లింపు, దసరాకు 11వ పీఆర్‌సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాలు పెంపుపై పట్టు పట్టనున్నట్టు సమాచారం.
ఇన్నాళ్లు తాము డిమాండ్లు చేయడమే తప్ప ప్రభుత్వ వైపు నుంచి స్పందన కరువైందనే ఆవేదన ఉద్యోగ సంఘాల నేతల్లో ఉండేది. ఉద్యమబాట పడతామనే హెచ్చరికతో ప్రభుత్వం ఒక మెట్టు దిగిందని ఉద్యోగులు భావిస్తున్నారు. చర్చల అనంతరం ప్రభుత్వ స్పందించే తీరును బట్టి ఉద్యోగులు తీసుకునే నిర్ణయం ఆధారపడి వుంటుంది.