ప్రభుత్వం ఏ పని చేసినా సరే, ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. అందులో లోపాలు ఏరడానికి కొందరు భూతద్దాలు పట్టుకుని కాచుక్కూచుంటారు. ఇప్పుడు పచ్చమీడియా అదే పని చేస్తోంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ నియామకాల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై కూడా అనుమానాలు పెంచేలా కథనాలను వండి వారుస్తోంది. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా ఉద్యోగ నియామకాలకు తెరతీస్తోంటే అది కూడా చూచి ఓర్వలేకపోతున్న తీరు ఇది.
ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు, పైరవీలకు అవకాశం లేకుండా, తద్వారా ప్రభుత్వంపై మచ్చ రాకుండా జగన్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటుండగా.. వాటిని అభినందించాల్సిందిపోయి.. అందులో రంధ్రాన్వేషణ కథనాలను పేరెన్నికగన్న పచ్చమీడియా అందించడం చిత్రంగా కనిపిస్తోంది.
ఇంతకూ విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా.. ఉద్యోగ నియామకాల ప్రక్రియకు కసరత్తు ప్రారంభించింది. ఇటీవలే ఏపీపీఎస్సీకి మాజీ డీజీపీ గౌతం సవాంగ్ ఛైర్మన్ గా నియమితులైన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అలాగే ఇందులో సభ్యులు కూడా ఉన్నారు. కొందరు అధికారులు, కొందరు ఇతర వ్యక్తులను ప్రభుత్వం ఇందులో నియమిస్తుంది. తాజాగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ జరుగుతుండగా.. ఏపీపీఎస్సీ సభ్యులు కొత్త కోరికను బయటపెట్టారు.
ఉద్యోగ నియామకాల్లో రాతపరీక్ష, ఇతర అర్హతలను పరిశీలించిన తర్వాత.. అంతిమంగా ఇంటర్వ్యూ చేసిన తర్వాత మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేయాలనేది వారి డిమాండ్. ఈ డిమాండ్ ను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. పరీక్షల్లో నెగ్గిన వారి అర్హతలను తాము స్వయంగా ఇంటర్వ్యూలో పరిశీలించిన తర్వాత.. పోస్టింగులు ఇవ్వాలనేది వారి కోరిక.
అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇంటర్వ్యూలు అక్కర్లేదని, కార్పొరేట్ మరియు ఇతర సంస్థలు కొన్ని చేపడుతున్న పద్ధతులను పరిశీలించి ఆ మేరకు నియామకాలు పూర్తి చేయాలని సూచించింది.
సాధారణంగా అర్హతలను బేరీజు వేసిన తరువాత.. ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూల దశలోనే అన్ని రకాల పైరవీలకు అవకాశం ఉంటుంది. రాజకీయ ఒత్తిళ్లు, ఇంటర్వ్యూ బోర్డులో ఉండే సభ్యుల అవినీతి వ్యవహారాలు, ఏపీపీఎస్సీ సభ్యుల పైరవీలు ఇవన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సకల అరాచకాలకు చెక్ పెట్టేలా.. ప్రభుత్వం ఇంటర్వ్యూలు లేకుండానే నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది.
అయితే పైరవీల చాన్స్ మిస్సయిపోతుందని బాధపడే సభ్యులు మాత్రం.. ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అడుగుతున్నది తాము నియమించిన సభ్యులే అయినా.. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది.
అంటే నూరుశాతం నిజాయితీగా, ఎలాంటి అవినీతికి, లంచాలకు,పైరవీలకు ఆస్కారం లేకుండా నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు లెక్క. దీనిని అభినందించాల్సింది బదులుగా.. వక్రభాష్యాలతో కథనాలు ఇవ్వడం పచ్చమీడియా సంకుచితత్వానికి నిదర్శనంగా కనిపిస్తోంది.