దివంగత ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ తో పాటు, త్వరలో చంద్రబాబుకి కూడా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ మొదలు పెట్టొచ్చు టీడీపీ.
ఎందుకంటే ఎన్టీఆర్ కి చంద్రబాబు బతికుండగా భారతరత్న వచ్చే ఛాన్స్ లేదు. వచ్చే అవకాశం ఉన్నా అడ్డుపుల్ల వేసే మొదటి వ్యక్తి ఆయనే అని అందరికీ తెలుసు. మరోవైపు ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాల్సిందేనంటూ ఎడతెగని పోరాటం చేస్తామంటూ ఆయన జయంతి, వర్థంతి, పార్టీ ఆవిర్భావ దినోత్సవాల రోజున పడికట్టు డైలాగ్ ఒటి కొడతారు.
అసలు ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తే టీడీపీ నాయకులు ఏం చేస్తారు, పోనీ భారతరత్న ఇప్పించడానికి వారు చేయాల్సిందేంటి, చేస్తున్నదేంటి..? మనోభావాలు, ప్రాంతీయ వాదాలు పెట్రేగిపోతున్న ఈరోజుల్లో సౌత్ నుంచి ఎన్టీఆర్ కి భారతరత్న ఇచ్చే సాహసం కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా చేస్తుందా..?
అధికారంలో ఉండగా ఏంచేశారు..?
పోనీ ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలంటూ కేంద్రంపై పోరాటం చేస్తామంటున్నారు. అంతా బాగానే ఉంది. మరి అధికారంలో ఉండగా బాబు ఏం చేశారు.
ఎన్డీఏలో మంత్రి పదవులు తీసుకున్నారు కదా అప్పుడెందుకు భారతరత్న డిమాండ్ చేయలేదు. అప్పట్లో ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టినట్టే, భారతరత్నని కూడా తాకట్టు పెట్టేశారా..? అధికారంలో ఉండగా సైలెంట్ గా ఉన్న బాబు, ఇప్పుడు తాను వెన్నుపోటు పొడిచిన మామకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం పిచ్చ కామెడీ.
రిటైర్మెంట్ వయసు దాటిపోయిన చంద్రబాబుకి కూడా భారతరత్న ఇవ్వాల్సిందేనని త్వరలో టీడీపీ డిమాండ్ చేసే రోజొస్తుందని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. కొన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్, బాబు.. ఇద్దరికీ భారతరత్న ఇవ్వాలంటూ లోకేష్ పోరాటం చేస్తారని, అది ఎడతెగని భేతాళ కథ లాగా సాగుతుందని కామెడీ చేస్తున్నారు.
ఎన్టీఆర్ పేదల కోసం పాటుపడ్డారే కానీ, అవార్డుల కోసం అర్రులు చాచలేదు. ఇప్పుడు చంద్రబాబుకి కూడా ఎన్టీఆర్ కి అవార్డు రావడం ఇష్టంలేదు, ఆ పేరుతో రాజకీయం చేయడం మాత్రమే ఇష్టం. అందుకే ఇలా సీజన్ల వారీగా ఎన్టీఆర్ పేరు తెరపైకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుతుంటారు బాబు.