ప్రాజెక్టులపై చర్చలేనా.. పనులు జరుగుతాయా..?

వైసీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు కాస్త బ్రేక్ పడిందనే ప్రచారం ఉంది. ఎప్పటికప్పుడు పోలవరం డెడ్ లైన్లు పొడిగించుకుంటూ పోతున్నారనే అపవాదు కూడా ఉంది. మంత్రి…

వైసీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు కాస్త బ్రేక్ పడిందనే ప్రచారం ఉంది. ఎప్పటికప్పుడు పోలవరం డెడ్ లైన్లు పొడిగించుకుంటూ పోతున్నారనే అపవాదు కూడా ఉంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ట్రోలింగ్ కూడా ఉంది. తాజాగా ఇప్పుడు మళ్లీ ప్రాజెక్ట్ లు పూర్తి చేసే డెడ్ లైన్ మార్చుతూ సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈసారైనా దీనికి కట్టుబడి ఉంటారా లేదా అనేది తేలాల్సి ఉంది.

పోలవరం ప్రాజెక్ట్ సహా ఇతర ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వైసీపీ హయాంలో అనుకున్నంత స్పీడ్ గా జరగలేదు. పోనీ పోలవరానికి కేంద్రం నిధులకి, పునరావాసానికి.. సంబంధం ఉందని అనుకుందాం.. నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్, పెన్నా బ్యారేజ్ పనులు దాదాపు చివరికి వచ్చినా మూడేళ్లుగా పురోగతి లేదు. జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నా ఫలితం లేదనే అపవాదు ఉంది.

గతంలో పెన్నా వరదల సమయంలో సీఎం జగన్ నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు సంక్రాంతి నాటికి ప్రారంభోత్సవాలకు నేనే వస్తానంటూ మాటిచ్చారు. ఇప్పుడు మార్చి పోయి, ఉగాది కూడా వస్తోంది, ఇప్పటికీ ఆ పనులు పూర్తి కాలేదు. తాజాగా గౌతమ్ రెడ్డి పేరు సంగం బ్యారేజ్ కి పెట్టాలనే నిర్ణయం తీసుకోవడంతో కనీసం ఆ బ్యారేజ్ ని అయినా మే 15 నాటికి పూర్తి చేయాలనుకుంటున్నారు.

దీంతోపాటే పెన్నా బ్యారేజ్ పనుల్ని కూడా పరిగెత్తిస్తున్నారు. ఈ రెండిటితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్ట్ లపై కూడా సీఎం జగన్ సమీక్ష జరిపారు.

ఎన్నికల వేళ రిస్క్ చేస్తారా..?

ఎన్నికల వేళ, మరోసారి కేవలం సమీక్షలతో సరిపెడితే.. ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. కరోనా వల్ల రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నమాట వాస్తవమే. అదే సమయంలో ఆదాయం అంతా సంక్షేమ పథకాలకే మళ్లిస్తున్నమాట కూడా వాస్తవమే. కానీ అభివృద్ధిని కూడా కాస్త పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్, నేరడి బ్యారేజ్, అవుకు రెండో టన్నెల్ పనులు, తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు పనులు, వంశధార-నాగావళి అనుసంధాన పనులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బ్యాలెన్స్ పనులు.. ఇలా చాలా వరకే వాయిదాలు పడుతూ వస్తున్నాయి. వీటన్నిటికంటే పెద్దది పోలవరం. గతంలోనే నేను పోలవరం కట్టాను, జగన్ కి రిబ్బన్ కట్ చేయడం చేతకాలేదంటూ విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు. టీడీపీ అనుకూల మీడియా తిమ్మిని బమ్మిని ఎలా చేస్తుందో అందరికీ తెలిసిందే.

ఈ దశలో ఇప్పటికైనా ప్రాజెక్ట్ ల వ్యవహారంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించడం సంతోషం. కానీ ఇక రిస్క్ చేయడం మాత్రం కుదరదు. పనులు ముందుకు జరగాల్సిందే. సంక్షేమాన్ని పక్కనపెట్టాలని ఎవరూ సలహా చెప్పరు కానీ, అభివృద్ధిని కూడా పట్టించుకోవాలి. లేకపోతే ప్రజలు కేవలం సంక్షేమంతోనే సంతోషపడతారా లేదా అనేది అంచనా వేయడం కష్టం.