వినేవాళ్లుంటే చంద్రబాబు ఏమైనా చెబుతారని సరదాగా అంటుంటారు. లోకేశ్‌నే కాదు, లోకాన్ని కూడా తానే సృష్టించానని రానున్న రోజుల్లో ఆయన తప్పక గొప్పలు చెప్పుకుంటారని సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు టీడీపీకి చావుబతుకుల సమస్య. ఈ దఫా అధికారంలోకి రాకపోతే, ఇక టీడీపీ గత కాలపు ఘన చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. శ్రేణుల్ని సమరానికి సమాయత్తం చేయడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే ఇస్తామని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
‘నేను అప్పట్లో చేసిన కృషి వల్లే తెలుగు వారికి ఐటీ కొలువుల్లో ప్రాధాన్యం లభిస్తోంది. ఎంతో కష్టపడి, పారిశ్రామిక దిగ్గజాలను ఒప్పించి హైదరాబాద్‌కు ఐఎస్‌బీని రప్పించాను. అది నా పిల్లలు చదివేందుకు కాదు. రాష్ట్రం కోసమే చేశాను. నేను ప్రారంభించిన జీనోమ్ వ్యాలీలో కొవిడ్ వ్యాక్సిన్ ఆవిష్కారం జరిగింది. అప్పట్లో నేను ప్రారంభించిన పనులను తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు. వారికి ధన్యవాదాలు’ అని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు మాట తీరు గమనిస్తే…. టీడీపీ ప్రభుత్వమనే మాటే రాలేదు. ఎంతసేపూ ‘నేను’ అని వ్యక్తిగత గొప్పలు చెప్పుకోడానికే ప్రాధాన్యం ఇచ్చారు. హైదరాబాద్, గోల్కొండ, చార్మినార్, నిమ్స్, ఉస్మానియా….ఇలా ఒకటేమిటీ, అన్నీ తన హయాంలో రూపుదిద్దుకున్నట్టు బడాయికి పోయారాయన. ఎన్నెన్నో గొప్ప పనులు చేసిన చంద్రబాబుకు, తన కొడుకును లీడర్‌గా తయారు చేయడం ఎందుకు చేతకాలేదో అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఉండదు.
కనీసం మంగళగిరిలో లోకేశ్‌ను గెలిపించుకోలేని అసమర్థ సీఎంగా చంద్రబాబు మిగిలిపోయారు. కుప్పం మున్సిపాలిటీని, అక్కడి పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానాలను కూడా పోగొట్టుకునే దుస్థితికి టీడీపీ చేరుకోడానికి కారకులెవరో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. 40 ఏళ్లకు పైబడి రాజకీయ అనుభవం, అలాగే పార్టీకి కూడా అన్నే సంవత్సరాలు నిండిన నేపథ్యంలో తన తర్వాత నాయకుడెవరో ప్రకటించలేని దయనీయ స్థితి ఎందుకొచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. తన కుమారుడు లోకేశ్‌ను వారసుడిగా ప్రకటించడానికి చంద్రబాబు భయపడడంలోనే ఆయన నిస్సహాయత, అసమర్థత స్పష్టంగా బయట పడుతున్నాయి.
వాస్తవ పరిస్థితులు ఇలా వుంటే, గొప్పలు చెప్పుకోవడం దేనికో. ఇప్పటికైనా లోకేశ్‌కు నమ్మకమైన నియోజకవర్గాన్ని ఏర్పరిచి, ఆ తర్వాత ఎన్ని మాట్లాడినా జనం నమ్ముతారు. ఉట్టికెక్కలేనమ్మా ఆకాశాని కెక్కుతా అనే సామెత చందాన….లోకేశ్‌ను నాయకుడిగా తయారు చేయలేని చంద్రబాబు…. తానేదో సమాజాన్ని, టీడీపీని ఉద్దరించానని గొప్పులు చెప్పుకోవడం ఆయనకే చెల్లింది. మొదట తన పుత్రరత్నాన్ని తీర్చిదిద్దడంపై దృష్టిసారిస్తే… టీడీపీకి ఎంతో మేలు చేసినవారవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.