ఆధిపత్య పోరులో భాగంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును కేసులో ఇరికించిన వైసీపీ ప్రభుత్వం … ఇప్పుడు ఆ తప్పు నుంచి బయటపడేందుకు లాజిక్కుల వేటలో పడింది. ఇక్కడ మాగుంట శ్రీనివాసులురెడ్డికి టీడీపీ మద్దతుగా నిలబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తన ప్రత్యర్థి, టీడీపీ సీనియర్ నేత సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేరు వినడానికి కూడా ఇష్టపడరు.
అలాంటి సోమిరెడ్డి ఓ వ్యూహం ప్రకారం అధికార పార్టీ ఎంపీని సమర్థించడంతో పాటు కాకాణిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో కాకాణిని వైసీపీలో ఒంటరి చేసేందుకు సోమిరెడ్డి సరికొత్త ఎత్తుగడ వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు వైసీపీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీని ప్రజల్లో పలుచన చేస్తున్నాయనే అభిప్రాయాలు లేకపోలేదు. మాంసం తింటున్నారని ఎముకలు మెడలో వేసుకున్న చందంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో సర్వేపల్లి రిజర్వాయర్‌లో అనుమతి లేకుండా తవ్వకాలు జరిపిన ఘటనలో ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు ఎం.శ్రీనివాసులురెడ్డి తండ్రి రాఘవరెడ్డి పేరును క్రిమినల్ కేసులో చేర్చారు. మాగుంట ఆగ్రోస్ ఫార్మస్‌కు మట్టి అవసరమని దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో ఆ పేరు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిదేనని ఇరిగేషన్ అధికారులు, పోలీసు వర్గాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. చివరికి ఏ2 నిందితునిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఇలాంటి వ్యవహారాల్లో సామాన్యులకు అనుమతులు ఇచ్చే పరిస్థితి ఉందా? అనేది కూడా ఆలోచించని అధికారుల అజ్ఞానం ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తోంది. అక్రమ తవ్వకాల్లో ఒకవేళ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రమేయం నిజమే అయితే… చట్ట రీత్యా ముందుకెళ్లడానికి ఇబ్బంది ఏంటనే ప్రశ్నలు పౌర సమాజం నుంచి వస్తున్నాయి.
ఎందుకంటే మాగుంట తప్పు చేస్తే, అధికార పార్టీ కావడం వల్ల ఒప్పు అవుతుందా? అనే ప్రశ్నలు లేకపోలేదు. ఎటూ మాగుంటపై కేసు నమోదు చేశారని, సమగ్ర విచారణ జరిపి వైసీపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలనే డిమాండ్లు లేకపోలేదు.
కానీ ఇరిగేషన్ అధికారులు, పోలీస్ అధికారుల మల్లగుల్లాలు చూస్తుంటే, అధికార పార్టీ ఎంపీ పేరును క్రిమినల్ కేసు నుంచి ఎలా తొలగించాలనే దానిపై దృష్టి ఉందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇరిగేషన్ అధికారులు సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
సర్వేపల్లి రిజర్వాయర్‌లో మట్టి తవ్వకాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎం.శ్రీనివాసులురెడ్డి, తండ్రి రాఘవరెడ్డి అని ఉంది తప్ప ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి అని లేదని ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ ఈఈ పీ.కృష్ణమోహన్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇదంతా తప్పును కప్పి పుచ్చు కోడానికి లేదా సరిదిద్దుకునే యత్నంలో భాగమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దరఖాస్తులో పేర్కొన్న సెల్‌నంబర్ కూడా ఎంపీది కాదని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద అనుమతులకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కడా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అని పేర్కొనలేదని స్పష్టం చేశారు. కాబట్టి ఆయన పేరుతో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కృష్ణమోహన్ తెలిపారు. మరోవైపు పోలీస్ ఉన్నతాధికారులు ఇరిగేషన్ అధికారులను నెల్లూరుకు పిలిపించుకుని ఫిర్యాదుపై ఏం చేయాలనే అంశంపై చర్చించినట్టు సమాచారం.
ఇప్పుడు క్రిమినల్ కేసుల నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును తొలగించారని అనుకుందాం. కానీ జగన్ ప్రభుత్వం అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోందని ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేక భావనను తొలగించడం సాధ్యమా? సర్వేపల్లి రిజర్వాయర్‌లో అక్రమ తవ్వకాల పుణ్యమా అని నెల్లూరు జిల్లాలో వైసీపీ అభాసుపాలైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న చందంగా… మాగుంట శ్రీనివాసులురెడ్డి కేసు వ్యవహారం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.