టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై అమరావతి ఆందోళనకారులు ఆశలు వదులుకున్నారు. ఈ విషయం వారి మాటల్లోనే స్పష్టమైంది. ఎలాగైనా అమరావతిలోనే పరిపాలన రాజధాని కొనసాగేలా చంద్రబాబు గిమ్మిక్కులు చేస్తారని ఇంతకాలం వారు నమ్ముతూ వచ్చారు. పరిపాలన రాజధాని అమరావతిలోనే ఉంటుందని, ఇక్కడి నుంచి తరలించడం ఎవరి వల్లా కాదని నమ్మబలుకుతూ వచ్చారు.
40 ఏళ్ల రాజకీయ చాణక్యం, 14 ఏళ్ల పాలనానుభవం ఉన్న పెద్ద మనిషి చెప్పడంతో ఏదో అద్భుతం జరగకపోదా అని అమరావతి ఆందోళనకారులు భావిస్తూ వచ్చారు. అమరావతిలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన ఈనెల 8వ తేదీకి 600వ రోజుకు చేరుకుంటుంది. కాలం గడిచేకొద్ది వాస్తవాలు కళ్లకు కడుతున్నాయి.
చంద్రబాబే కాదు, ఏ బాబూ రాజధాని తరలింపును అడ్డుకోలేరని అమరావతి ఆందోళనకారులు ఓ అభిప్రాయానికి వచ్చినట్టున్నారు. రాజకీయ పార్టీల వల్ల తమకు ఒరిగేదేమీ ఉండదనే నిర్ణయానికి వారు వచ్చారు. ఇక తమకు న్యాయస్థానాలు, దేవుళ్లే దిక్కు అనే నినా దాన్ని అందుకున్నారు. దీన్ని బట్టి రాజకీయ పార్టీలు, వ్యక్తులపై వారి నమ్మకం పోయిందనే విషయం చెప్పకనే చెబుతోంది.
అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఉద్యమం 600వ రోజుకు చేరుతున్న సందర్భంగా … ఆ రోజు వినూత్న నిరసన తెలుపుతామన్నారు. నేలపాడులోని హైకోర్టు నుంచి మంగళగిరిలోని లక్ష్మీనరసిం హస్వామి ఆలయం వరకూ బైక్ ర్యాలీ చేపడతామన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు కోర్టులు చెక్ పెడుతున్నాయన్నారు. తమకు న్యాయస్థానాలపై విశ్వాసం ఉందన్నారు. న్యాయస్థానాలు, దేవుళ్లే తమకు రక్షణ అన్నారు. అమరావతి ఆందోళనకారుల నిర్వేదానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. అమరావతి ఆందోళనకారులకు భరోసా కల్పించే స్థాయిలో చంద్రబాబు ఉద్యమించలేదనే విమర్శలు లేకపోలేదు. ఎందుకంటే దేవుళ్లు ఎక్కడో లేరు. మానవుడే మాధవుడని పెద్దలు చెబుతారు.