టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబుపై నమోదైన సీఐడీ కేసుపై టీడీపీ, ఎల్లో మీడియా సైలెంట్ అయ్యాయి. సాధారణంగా తమ నేతలపై కేసు నమోదైతే చంద్రబాబు మొదలుకుని, మిగిలిన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా నానాయాగీ చేయడం తెలిసిందే. కానీ అశోక్‌బాబు విషయంలో ఎందుకనో వారంతా మౌనాన్ని ఆశ్రయించారు. దీంతో అశోక్ నేరం చేశారని ఎల్లో బ్యాచ్ మౌనమే నిరూపిస్తోందని ప్రత్యర్థులు అభిప్రాయపడుతున్నారు.
ఫోర్జరీ విద్యార్హత సర్టిఫికెట్తో వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం పొంది ప్రభుత్వాన్ని మోసం చేశారనే అభియోగంపై టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. లోకాయుక్త ఆదేశాలతో అశోక్‌బాబుపై సెక్షన్–477ఎ, 465, 420 కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తనపై నమోదైన కేసు విషయమై అశోక్‌బాబు కూడా ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. అశోక్‌బాబు డి.కాం (డిప్లమో ఇన్ కంప్యూటర్స్) చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. అనంతరం ప్రమోషన్‌పై సీనియర్ అసిస్టెంట్ అయ్యారు. కమిషనర్ కార్యాలయంలో తాను కోరుకున్న పోస్టును దక్కించుకోవాలంటే డిగ్రీ విద్యార్హత తప్పనిసరి. ఈ నేపథ్యంలో తన సర్వీసు రిజిస్టర్‌లోని విద్యార్హత కాలమ్‌లో ఉన్న డీ.కాం.ను ట్యాంపర్ చేసి బీ.కాం.గా దిద్దారనేది అశోక్‌బాబుపై ప్రధాన అభియోగం.
అశోక్‌బాబుపై సీఐడీ కేసు విషయమై చంద్రబాబు, లోకేశ్ మౌనం పాటించడంతో అభియోగంలో నిజాలున్నాయనే చర్చ టీడీపీలో అంతర్గతంగా జరుగుతోంది. సహజంగా వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని, అనవసరంగా కేసుల్లో ఇరికిస్తోందనే విమర్శలు అశోక్ విషయంలో రాకపోవడాన్ని గమనించొచ్చు. అశోక్‌ను వెనకేసుకుని రావడం కంటే పట్టించుకోకుండా ఉండడమే మంచిదనే అభిప్రాయానికి టీడీపీ వచ్చినట్టు సమాచారం.
టీడీపీ నేతల తప్పొప్పులతో సంబంధం లేకుండా క్లియరెన్స్ సర్టిఫికెట్లు, అనుకూల తీర్పులు ఇచ్చే ఎల్లో మీడియా కూడా అశోక్‌బాబు విషయంలో రాద్ధాంతం చేయకపోవడం గమనార్హం. దీన్నిబట్టి అశోక్‌బాబుకు చట్టపరంగా సమస్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అశోక్‌బాబు చేసిన నేరానికి శోకం తప్పదని టీడీపీ ఓ నిర్ధారణకు వచ్చినట్టేనా?