ఇటు ఈబీసీ నేస్తం.. అటు పీఆర్సీ..జనాలకు ఫుల్ క్లారిటీ

ఏపీ ఉద్యోగులు కొత్త పీఆర్సీ పీటముడులపై రోడ్డెక్కారు. అదే రోజు సీఎం జగన్ ఈబీసీ నేస్తం పేరుతో మహిళల ఖాతాల్లో 589కోట్ల రూపాయలు జమ చేశారు. దీంతో సహజంగానే రోడ్డెక్కిన సగటు ఉద్యోగికి కడుపు…

ఏపీ ఉద్యోగులు కొత్త పీఆర్సీ పీటముడులపై రోడ్డెక్కారు. అదే రోజు సీఎం జగన్ ఈబీసీ నేస్తం పేరుతో మహిళల ఖాతాల్లో 589కోట్ల రూపాయలు జమ చేశారు. దీంతో సహజంగానే రోడ్డెక్కిన సగటు ఉద్యోగికి కడుపు మండింది. మాకు జీతాలు పెంచడానికి డబ్బుల్లేవంటారు, సంక్షేమ పథకాలకు మాత్రం కోట్లకు కోట్లు వెచ్చిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. 

కానీ జనాలకు మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆరు నూరైనా జగన్ సంక్షేమ పథకాలు ఆపరు, మనకి అన్యాయం చేయరు అనే మెసేజ్ వెళ్లిపోయింది. దీంతో ఉద్యోగులకు జనం నుంచి కనీస మద్దతు కూడా లేకుండా పోయింది.

ఉద్యోగుల కష్టమేంటి..?

తమకి జీతాలు పెంచలేదనేది ఉద్యోగులకు అసలు బాధ, ఆ పుండుమీద కారం చల్లేలా జగన్ పేదలకు న్యాయం చేస్తున్నారు. వాస్తవానికి ప్రజలకు, పేదలకు ఆర్థిక సాయం అందితే అందరూ సంతోషించాలి. వందల కోసం వెదుక్కునే పేదలకి, వేల రూపాయల సాయం చేసిన జగన్ నిజంగా వారిపాలిట దేవుడయ్యారు. అదే సమయంలో లక్షల్లో జీతాలు తీసుకునే ఉద్యోగులు వేల రూపాయల్లో పెంపుదల లేదని రోడ్లెక్కి నిరసనలు చేస్తూ జగన్ ని విలన్ లా చూస్తున్నారు.

ఇక్కడే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. పేదవాళ్లకు పెట్టాల్సిన సమయంలో పెద్దవాళ్లు కొంతకాలం ఇబ్బంది పడినా నష్టంలేదనే మెసేజ్ జనాల్లోకి వెళ్లిపోయింది. దీంతో సహజంగానే ఉద్యోగుల డిమాండ్లపై, వారి పోరాటాలపై ఎవరికీ సింపతీ లేకుండా పోయింది. జగన్ పై అభిమానం మరింత పెరిగింది.

మాకు అన్యాయం చేయరు.. మా కడుపు మాడ్చరు..

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఉద్యోగులు అర్థం చేసుకోండి అని ప్రభుత్వం చెబుతోందంటే.. రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాల్లో కూడా కోతపడుతుందేమోననే అనుమానాలు జనాల్లో ఉన్నాయి. అయితే వాటిని పటాపంచలు చేస్తూ జగన్ జనం కోసం మాత్రం తగ్గేది లేదని స్పష్టం చేశారు. 

ఈబీసీ నేస్తాన్ని అమలులో పెట్టారు, అమ్మఒడి సహా ఏదీ ఆలస్యం కాదని భరోసా ఇచ్చారు. దీంతో సహజంగానే జనాలకు జగన్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. ఏపీలో ఏది ఆగినా సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఆగబోవని అర్థమైంది.