మూడు నాలుగేళ్ల కిందటి సంగతి. 2019 ఎన్నికలకు టీడీపీ ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండేదో తేల్చే విషయం అది. టీడీపీకి, జూనియర్ ఎన్టీఆర్ కి ముడిపెట్టి ఎవరైనా చిన్న కామెంట్ చేస్తే చాలు, టోటల్ టీడీపీ క్యాడర్ అంతా విరుచుకుపడేది. అప్పటికి చంద్రబాబు మంత్రివర్గంలో పెద్దగా మాట్లాడ్డం రాని మంత్రులు కూడా ఎన్టీఆర్ పై కామెంట్ చేయడానికి మాత్రం ఉబలాటపడేవారు.
అధినేత దృష్టిలో గొప్ప పేరు కోసం పాకులాడేవారు. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని కోబ్రా ద్వయం లోకేష్, శ్రీభరత్ కూడా ఎన్టీఆర్ పై అంతెత్తున ఎగిరిపడేవారు.
జూనియర్ ఎన్టీఆర్ అవసరం పార్టీకి ఏముందనేవారు లోకేష్. పార్టీకి సేవ చేయడానికి ఓ కార్యకర్తగా వస్తే ఎన్టీఆర్ ను ఆపేవారు ఎవ్వరూ లేరంటూ ఆనాడు అధికార మదంతో, అదో రకమైన యాసతో సెటైర్లు వేసేవారు లోకేష్. ఇక ఆయన కో బ్రదర్ బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ కూడా ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చి సంచలనం రేపారు.
చంద్రబాబుది మరింత ఓవర్ యాక్షన్. అవసరం ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయ ప్రచారానికి తిప్పి, ఆయనకు ఖాకీ గుడ్డలు వేసి ప్రచార రథం ఎక్కించిన చంద్రబాబు, 2014 విజయం తర్వాత ఎన్టీఆర్ పేరెత్తడానికి కూడా ఇష్టపడేవారు కాదు.
పార్టీ అందర్నీ కలుపుకొని పోతుంది తమ్ముళ్లూ.. కానీ వస్తూనే పదవులు ఆశించడం సరికాదు అంటూ పరోక్షంగా జూనియర్ ని దెప్పిపొడిచేవారు. ముందు సేవ చేయాలి, ఆ తర్వాత పదవుల్లోకి రావాలంటూ నీతి సూత్రాలు వల్లించేవారు. ఇలా తారక్ పై విరుచుకుపడిన బ్యాచ్ అంతా ఇప్పుడు సైలెంట్ అయింది.
కార్యకర్తల ధిక్కార స్వరం..
అయితే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. టీడీపీలోకి ఎన్టీఆర్ ని తీసుకు రావాలంటూ గుసగుసలాడ్డం కాదు, ఏకంగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి, జెండా దిమ్మలపై జూనియర్ బొమ్మ రెపరెపలాడుతోంది.
ఎక్కడో ఎందుకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ గొడవ జరుగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి..?
ఆమధ్య ఓ టీవీ ఇంటర్వ్యూలో జూనియర్ రంగప్రవేశం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలయ్య దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. అసలు ఆయన ఏం చెప్పారో ఎవరికీ అర్థం కాకుండా ముగించారు. అలా ఉంది ఎన్టీఆర్ ఎంట్రీపై టీడీపీ నాయకుల రియాక్షన్. అందరూ తేలుకుట్టిన దొంగలే.
ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం టీడీపీలోకి జూనియర్ ని తీసుకు రావాలంటున్న వేళ, పెద్ద తలకాయలకు ఏంచేయాలో తెలియడంలేదు.
ఇంతకీ టీడీపీకి ఎన్టీఆర్ కావాలా..? వద్దా..?
ఈ సందర్భంలో చంద్రబాబు, లోకేష్ కి ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఎన్టీఆర్ మాకొద్దు అంటే ఓ సమస్య.. ఎన్టీఆర్ కావాలి అంటే మరో సమస్య. ఎన్టీఆర్ వద్దంటే సగం క్యాడర్ టీడీపీకి రాంరాం చెప్పేస్తుంది. ఎన్టీఆర్ రావాలి అంటే మాత్రం లోకేష్ కు మూడినట్టే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్టీఆర్ పేరు ప్రకటించాల్సిందే. దీంతో ఎటూపాలుపోక తండ్రికొడుకులిద్దరూ తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారు.
కాన్వాయ్ ముందు ఎన్టీఆర్ జెండాలు కనిపిస్తే చూసీచూడనట్టు తప్పుకుంటున్నారు. జై ఎన్టీఆర్ నినాదాలు వినిపిస్తే పైపైన నవ్వుతూ సైడ్ అయిపోతున్నారు. అయితే ఎక్కువ రోజులు తప్పించుకోలేరు.. ఎన్టీఆర్ పై బాబు-లోకేష్ కలిసి ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే. లేదంటే ఎన్నికల నాటికి అదే ప్రధాన సమస్యగా మారి కూర్చుకుంటుంది. అప్పుడిక తండ్రికొడుకులు లాక్కోలేక పీక్కోలేక అవస్తలు పడాలి.
ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి..?
టీడీపీ నాయకులంతా జూనియర్ దగ్గరకు వెళ్లి బాబూ మీరు వచ్చేయండి అంటే.. ఎగేసుకు రావడానికి ఎన్టీఆర్ అప్పటి లాగా అమాయకుడేం కాదు. అవసరం ఉన్నంత వరకే తనని వాడుకుని పక్కనపెట్టేస్తారని ఆయనక్కూడా బాగా తెలుసు. అందులోనూ సినిమా కెరీర్ బ్రహ్మాండంగా సాగుతున్న ఈ దశలో రాజకీయాల్లోకి వెళ్లి దాన్ని నాశనం చేసుకునేంత ముందుచూపులేని వ్యక్తి కాదు.
తాత పెట్టిన పార్టీ నాశనం అవుతూ, తాత పేరు మసకబారిపోయే పరిస్థితుల్లో ఊరికే వదిలేసే వ్యక్తి కూడా కాదు ఎన్టీఆర్.. అందుకే జూనియర్ కూడా ప్రస్తుతానికి నా ఫోకస్ సినిమాలే అంటారు. పతనం సంపూర్ణం అయిన తర్వాత బాబాయ్ లు, మామలు అందరూ వచ్చి బతిమిలాడితే అప్పుడు ఆలోచిస్తారు. జరగబోయేది ఇదే.