తెలుగులో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న TV9పై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దారుణమైన కామెంట్స్ చేశాడు. ఆ చానల్‌కు లేని దురుద్దేశాలు అంటగడుతున్నాడు.
ఇంత కాలం సీఎం జగన్‌పై ఏ రకమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నాడో ,అలాంటి అభాండాలే TV9పై కూడా బాబు వేశాడు.హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం (మైహోం రామేశ్వరం) చేసే వాళ్ల టీవీ ఛానల్ (TV9) అమరావతిని దెబ్బ తీయాలని చూస్తోందని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశాడు.
రెండ్రోజుల క్రితం TV9 ప్రతినిధి దీప్తిపై రాజధాని రైతుల్లో కొందరు దాడి చేయడాన్ని చంద్రబాబు ఖండించకపోగా, వారిని వెనకేసుకొచ్చేలా నిందలు వేయడం గమనార్హం. TV9 ప్రతినిధిపై దాడిని ఆంధ్రజ్యోతిలో కనీసం ఖండన వార్త లేకపోవడం పలు అనుమానాలు తావిచ్చింది.ఇప్పుడు చంద్రబాబు విమర్శలతో దాడి వెనుక ఎవరున్నారో స్పష్టమైందని పలువురు జర్నలిస్టులు చెబుతున్నారు.
TV9 సీఈవోగా రవిప్రకాశ్ ఉన్నప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా, నాటి ప్రతిపక్ష నేత జగన్‌పై ఇష్టమొచ్చినట్టు దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మేనేజ్మెంట్ మార్పు నేపథ్యంలో రవిప్రకాశ్ అనేక అడ్డంకులు సృష్టించడం, చివరికి ఫోర్జరీకి పాల్పడడం తెలిసిందే. ఆ తర్వాత రవిప్రకాశ్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
మారిన రాజకీయ పరిస్థితుల్లో TV9 యజమాని రామేశ్వర్‌కు జగన్ సర్కార్ టీటీడీ మెంబర్‌గా అవకాశం కల్పించింది. అంతేకాకుండా అతను తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా సన్నిహితుడు. దీంతో చంద్రబాబుకు TV9 అంటే నచ్చడం లేదు.
ఈ నేపథ్యంలో దాడి చేసిన రాజధాని రైతులను చంద్రబాబు వెనకేసుకు రావడంతో పాటు ఆ చానల్ అమరావతిని దెబ్బతీయాలనే కుట్ర పన్నుతోందంటూ దురుద్దేశాలను అంటగడుతూ మాట్లాడాడు. బాబు వైఖరిపై TV9 ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.