టీడీపీకి ఊహించని షాక్. రాజధానిపై రగడ జరుగుతున్న సమయంలో గుంటూరు టీడీపీ వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్‌ను సీఎం క్యాంప్ ఆఫీస్‌లో సోమవారం కలిశారు. ఈ కలయిక చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్టైంది. సీఎంను కలిసిన అనంతరం పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించడంతో ఆయన పార్టీ నుంచి తప్పుకున్నట్టే అని తెలుస్తోంది. ఒకవేళ పార్టీ కాదంటే ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరుతానని మద్దాలి ప్రకటించడం ద్వారా ఒక వ్యూహం ప్రకారమే సీఎంను కలిసినట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 15 స్థానాల్లో వైసీపీ, 2 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి మద్దాలి గిరి గెలుపొందారు. వైసీపీలో గిరి చేరడానికి సిద్ధమైన పరిస్థితుల్లో ఇక ఒకేఒక్క ఎమ్మెల్యే మిగలనున్నాడు.
సీఎంను కలిసిన అనంతరం మద్దాలి విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలిశానన్నాడు. గుంటూరులో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లగా రూ.25 కోట్ల బకాయిలు రిలీజ్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారన్నాడు. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడాన్ని స్వాగతించడంతో పాటు అభినందిస్తునన్నాడు. ఆంగ్ల మాధ్యమంపై చంద్రబాబు ద్వంద్వ వైఖరితో రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించాడు.
భవిష్యత్‌లో రాష్ట్రం ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందని గిరి చెప్పాడు. రాజధానిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. రైతులను మోసం చేసే ఉద్దేశం సీఎం జగన్‌కు లేదన్నాడు. అలాగే రైతులకు మోసం చేసిన చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. చంద్రబాబు ఐదేళ్లలో ఏం చేశారని ఇప్పుడు మాట్లాడుతున్నాడని ఆయన ప్రశ్నించాడు. రాజధానిని అభివృద్ధి చేసి ఉండే ఈ పరిస్థితి ఉండేది కాదన్నాడు.