సుజ‌నాచౌద‌రి గాలి తీసిన జీవీఎల్

“బీజేపీ జాతీయ విధానాల‌పై నేను మాత్ర‌మే చెబుతాను. మా పార్టీలో అంద‌రూ మాట్లాడే అవ‌కాశం ఉంది. అయితే అవి వారి వ్య‌క్తిగ‌తం. కేంద్రం ప‌రిధిలోకి రాజ‌ధాని అంశం రాదు” అని బీజేపీ ఎంపీ, జాతీయ…

“బీజేపీ జాతీయ విధానాల‌పై నేను మాత్ర‌మే చెబుతాను. మా పార్టీలో అంద‌రూ మాట్లాడే అవ‌కాశం ఉంది. అయితే అవి వారి వ్య‌క్తిగ‌తం. కేంద్రం ప‌రిధిలోకి రాజ‌ధాని అంశం రాదు” అని బీజేపీ ఎంపీ, జాతీయ నేత జీవీఎల్ చెప్పి, సొంత పార్టీ ఎంపీ సుజ‌నాచౌద‌రి గాలి తీశాడు.  ఏపీలో రాజ‌ధాని విష‌యంలో సుజ‌నాచౌద‌రి ఓవ‌రాక్ష‌న్‌ను భ‌రించలేక పార్టీ పెద్ద‌లే జీవీఎల్‌తో మాట్లాడించార‌నే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.

రాజ‌ధాని రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఆదివారం బీజేపీ ఎంపీ సుజ‌నాచౌద‌రి రాజ‌ధాని గ్రామాల్లో ప‌ర్య‌టించాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాని, కేంద్రాన్ని ప్ర‌స్తావ‌న‌కు తెచ్చి సొంత ప్ర‌యోజ‌నాల‌కు వాడుకుంటున్నార‌నే అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో వ్య‌క్త‌మ వుతోంది. అంతేకాకుండా సుజ‌నాచౌద‌రి రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతూ పార్టీకి డ్యామేజీ చేస్తున్నారే అభిప్రాయం పార్టీలో చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

“రాజ‌ధాని ఒక్క అంగుళం క‌దిలినా ప్ర‌జ‌లు, బీజేపీ చూస్తూ ఊరుకోవు. కేంద్రంతో చ‌ర్చించే ఈ మాట చెబుతున్నా. కేంద్రం అధికారాలేంటో అవ‌స‌ర‌మైన‌ప్పుడు చెబుతాం. రాజ‌ధాని రైతులారా ఇది మీ ఒక్క‌రి స‌మ‌స్య కాదు. ఇది రాష్ట్ర స‌మ‌స్య‌. అధైర్య‌ప డొద్దు. తాడిని త‌న్నేవాడు ఇక్క‌డుంటే, త‌ల‌ను త‌న్నేవాడు ఢిల్లీలో ఉన్నాడు. చూస్తూ ఊరుకోం” ఇవి సుజనాచౌద‌రి ఆదివారం రైతుల‌నుద్దేశించి మాట్లాడిన మాట‌లు.

ఈ నేప‌థ్యంలో సుజ‌నాకు కౌంట‌ర్ ఇచ్చేందుకు అన్న‌ట్టు జీవీఎల్ ఘాటుగా స్పందించాడు. “రాజ‌ధాని విష‌యంలో ఏ పార్టీలోనూ ఏకాభిప్రాయం లేదు. మా పార్టీలో ఎవ‌రైనా మాట్లాడే అవ‌కాశం ఉంది. అవి వారి వ్య‌క్తిగ‌త అభిప్రాయాలే. జాతీయ విధానం గురించి నేనే మాట్లాడుతా. నా మాట‌లే ఫైన‌ల్‌. రాజ‌ధాని పెట్ట‌మ‌ని కేంద్రం సూచించలేదు. అలాగ‌ని మార్చాల‌ని కూడా కేంద్రం సూచించ‌లేదు. ఒక‌వేళ రాష్ట్ర ప్ర‌భుత్వం అడిగితే కేంద్రం సూచ‌న‌లు చేస్తుంది. రాజ‌ధాని రైతుల‌కు న్యాయం చేయాల్సిన బాధ్య‌త జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఉంది” అని జీవీఎల్ స్ప‌ష్టంగా చెప్పాడు.

తాను కేంద్రంతో మాట్లాడే చెబుతున్నా అని సుజ‌నా చెప్ప‌డాన్ని జీవీఎల్ ప‌రోక్షంగా ఖండించాడు. అంతేకాకుండా ఆ మాట‌ల‌న్నీ వారి వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ని తేల్చేశాడు. కేంద్రం, ప్ర‌ధాని బూచీ చూపి జ‌గ‌న్ స‌ర్కార్‌ను బెదిరించాల‌నుకున్న సుజ‌నాచౌద‌రి ఎత్తుల‌ను జీవీఎల్ ఒక్క దెబ్బ‌తో చిత్తు చేశాడు. మొత్తానికి  జీవీఎల్ ప్రెస్‌మీట్ పెట్టి సుజ‌నాచౌద‌రి గాలి తీశాడ‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల నుంచి విన‌ప‌డుతోంది.