తెలుగుదేశం పార్టీ గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయింది. దానికి ముందు అంటే ఎన్నికల ఫలితాలు వెల్లడించేంటంతదాకా మాదే గెలుపు అంటూ టీడీపీ నేతలు ఒక్క లెక్కన ఊదరగొట్టారు. అందులో అగ్ర భాగం ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్నదే.
ఆయన టీడీపీకి వందకు మించి ఆ పై దాకా సీట్లు రావడం ఖాయమంటూ తెగ సర్వే కధలు వినిపించారు. రాసిపెట్టుకోమని సవాల్ కూడా చేశారు. ఇక ఓడిన తరువాత మాత్రం సైలెంట్ అయిపోయారు. ఇపుడు ఇన్నాళ్ళకు మళ్ళీ బుద్ధా వెంకన్న తన సర్వే నివేదికలను బయటకు తీస్తున్నారు.
ఉత్తరాంధ్రాతో మొదలుపెట్టి ఏపీవ్యాప్తంగా జనం ఇపుడు ఏమనుకుంటున్నారు అన్నదే బుద్ధా మార్క్ సర్వే అన్నమాట. జనమంతా వైసీపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారుట. అలా ఆరుగురిని వరసగా నిలబెట్టి జగన్ పాలన బాగుంది అని చెబితే బుద్ధా తన ఎమ్మెల్సీ పదవికి ఆ క్షణమే రాజీనామా చేస్తారట.
అంతే కాదు, ఉత్తరాంధ్రా ప్రజలంతా వైసీపీని ఎందుకు గెలిపించామా అని తెగ బాధపడుతున్నారుట. అందుకే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతో మొదలుపెట్టి అన్ని ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని బుద్ధా మార్క్ సర్వే రిపోర్టుని బయటపెట్టారు. విశాఖ నడిబొడ్డున కూర్చుని అమరావతి కీర్తనలూ చక్కగా ఆలపించారు.
అంతే కాదు, జమిలి ఎన్నికలు 2022 లో వస్తున్నాయట. ఇక చంద్రబాబు సీఎం కావడమే తరువాయి అని బుద్ధా వెంకన్న సర్వేలు చెబుతూంటే బాబు చెవుల్లో తెనె పోసినట్లుగా ఉండదు మరీ.
ఇలాగే గత పాలనలో కూడా పార్టీ వారంతా ఊహల్లో ఉండబట్టే కదా చంద్రబాబు ఆయన పార్టీ చెడి 23 సీట్లకు పడిపోయిందని మరో వైపు అదే పార్టీలో వినిపిస్తున్న సణుగుడు మీద కూడా సర్వే చేస్తే ఎంత బాగుణ్ణో.