ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబుకి సరైన పాయింట్ దొరకడం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక పాయింట్ ని హైలెట్ చేయాలనుకుంటున్నా.. వెంటనే అది వీక్ అయిపోతోంది. నిన్నటికి నిన్న వెక్కి వెక్కి ఏడ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు. తాజాగా వరదలపై విమర్శలు ఎక్కుపెట్టినా కేంద్ర బృందం సహాయక చర్యలు భేష్ అంటూ ప్రభుత్వానికే సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో అసలు బాబుకి ఏం చేయాలి, ఏ పాయింట్ పై విమర్శలు చేయాలనేది అర్థం కావడంలేదు.
తాజాగా బాబు మరో పాయింట్ పట్టుకున్నారు. మేం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాం.. మీరు అధైర్యపడొద్దంటూ ప్రజలు ధైర్యం చెబుతున్నారు. బాబు ఇస్తున్న బంపర్ ఆఫర్ కి నవ్వాలో ఏడ్వాలో ప్రజలకు అర్థం కావడం లేదు.
వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. గతంలో ప్రభుత్వ సాయంతో కట్టిన ఇళ్ల విషయంలో బకాయిలను ఒకేసారి రద్దు చేసుకుని, వాటిని తమ పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకునే సదవకాశం ఇది. గృహ నిర్మాణ సంస్థకు ఉన్న బకాయిలు వడ్డీతో కలిపి ఎంత ఉన్నా కూడా కేవలం 10వేల రూపాయలు కడితే సరిపోతుంది. గ్రామాల్లో 10వేలు, పట్టణాల్లో 15వేలు, నగర పాలక సంస్థల్లో 20వేల రూపాయలు కట్టి వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు.
అయితే దీనిపై కూడా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఓటీఎస్ పథకం కింద ప్రభుత్వానికి రూ.14,261 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్న టీడీపీ.. ఆ డబ్బుల్ని కట్టొద్దంటూ ప్రజల్ని రెచ్చగొడుతోంది. చంద్రబాబు పదే పదే ఈ విషయంపై ప్రజలకు విజ్ఞప్తులు చేస్తున్నారు.
ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. తాము అధికారంలోకి వస్తే డబ్బులేవీ కట్టించుకోకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించి ఇస్తామంటున్నారు. మరి తాను అధికారంలో ఉండగా ఆ పని ఎందుకు చేయలేదని అడిగితే మాత్రం బాబుకి నోరు పెగలదు.
ఓటీఎస్ రెఫరెండం..
పోనీ బాబు మాటలు జనం నమ్మారే అనుకుందాం. చంద్రబాబు చెప్పినట్టు ప్రభుత్వ ఆఫర్ కి లొంగకుండా.. బాబు వచ్చే వరకు వేచి చూసి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే అది నిజంగా ఆయన గొప్పతనమే అవుతుంది. నిజంగానే ఓటీఎస్ కి వెనకాడితే బాబుని జనం నమ్మినట్టే. ఓటీఎస్ డబ్బులు కట్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే మాత్రం బాబూ నువ్వు మాకు అవసరం లేదు అని 2024 కంటే రెండేళ్ల ముందే చెప్పినట్టు లెక్క.
జనం ఓటీఎస్ కి వెనకాడతారా.. బాబు అధికారంలోకి రాగానే ఉచితంగా చేస్తారని ఆశపడతారా అనేది వేచి చూడాలి. ఒకరకంగా చంద్రబాబు, ఎన్నికలకు రెండేళ్ల ముందే ఈ అంశంతో జనం నాడి పట్టేయొచ్చన్న మాట.