ఎన్టీఆర్ విషయంలో రాంగ్ బటన్ ప్రెస్ చేసిన బాబు

జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాలకు కేంద్ర బిందువయ్యారు. కుప్పం రచ్చతో అందరి కళ్లు జూనియర్ వైపు చూస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు ఏడుపుపై సరిగా రియాక్ట్ కాలేదని, మేనత్త విషయంలో ఎన్టీఆర్ స్థాయికి…

జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాలకు కేంద్ర బిందువయ్యారు. కుప్పం రచ్చతో అందరి కళ్లు జూనియర్ వైపు చూస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు ఏడుపుపై సరిగా రియాక్ట్ కాలేదని, మేనత్త విషయంలో ఎన్టీఆర్ స్థాయికి తగ్గట్టు గట్టిగా మాట్లాడలేదని టీడీపీ విమర్శించింది. 

ఓ దశలో తన శిష్యులైన వల్లభనేని వంశీ, కొడాలి నానిని.. జూనియర్ ఎన్టీఆర్ కంట్రోల్ చేయొచ్చు కదా అని వర్ల రామయ్య వారి మధ్య చిచ్చు పెట్టాలని కూడా చూశారు. అదంతా చంద్రబాబు డైరక్షన్లోనే జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే.

ఈమధ్య కొత్తగా కుప్పం వ్యవహారం కూడా రచ్చకెక్కింది. ఎన్టీఆర్ ని టార్గెట్ చేయాలని చూసే సరికి ఆయన అభిమానులకి కాలింది. నిన్న మొన్నటి వరకూ ఎన్టీఆర్ జిందాబాద్ అన్నవాళ్లు సైతం బాబులకు బాబు తారక్ బాబు, సీఎం ఎన్టీఆర్ అంటూ కొత్త నినాదాలందుకున్నారు. దీంతో మొదటికే మోసం వచ్చినట్టయింది. 

లోకే ష్ బాబుకి అంత సీన్ లేదని, సీనియర్ బాబు రిటైర్ అవుతున్నారని, ఇక తారక్ బాబే టీడీపీకి దిక్కు అని అర్థం వచ్చేలా జూనియర్ అభిమానులు గోలగోల చేశారు.

వద్దనుకున్నా పెరుగుతున్న ఇమేజ్..

జూనియర్ ఎన్టీఆర్ మౌనమే ఆయన ఇమేజ్ ని అమాంతం పెంచేస్తోంది. చంద్రబాబుకి పూర్తిగా మద్దతిచ్చి, వైసీపీ వాళ్లను తిట్టినా టీడీపీలో అంత మైలేజీ వచ్చేది కాదు. కానీ చంద్రబాబు పేరెత్తకుండా తెలివిగా మాట్లాడటం వల్లే జూనియర్ ఎన్టీఆర్… సీఎం సీఎం అనే నినాదాలు అందుకున్నారు. 

చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే బ్యాచ్ కి మాత్రం జూనియర్ విలన్ గా కనిపిస్తున్నారు. నిజంగా టీడీపీ నిలబడాలి, పెద్దాయన పెట్టిన పార్టీ బతికి బట్టకట్టాలనుకునేవారంతా ఎన్టీఆర్ కే మద్దతుగా నిలుస్తున్నారు. ఒకవేళ వర్ల రామయ్య చెప్పినట్టు ఎన్టీఆర్ కంట్రోల్ చేయాల్సి వస్తే.. ఆయన ఎంతమందిని కంట్రోల్ చేయాలనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ఎరక్కపోయి ఇరుక్కుపోయారా..?

ఇప్పటికిప్పుడు జూనియర్ ని బతిమిలాడుకుని ఓ స్టేట్ మెంట్ ఇప్పించుకున్నా అభిమానులు ఆగేలా లేరు. టీడీపీలో చంద్రబాబు పెత్తనం పోయి ఎన్టీఆర్ కుటుంబం పెత్తనం రావాలనుకునేవారంతా బాలకృష్ణ కంటే ఎక్కువగా జూనియర్ రాకను కోరుకుంటున్నారు. 

భువనేశ్వరి ఎపిసోడ్ తో ఈ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. 2024నాటికి టీడీపీకి ఇది ఓ రాచపుండులా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని రెచ్చగొట్టిన చంద్రబాబు ఫలితం అనుభవించక తప్పదని అంటున్నారు.