దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 2020 జూన్ తర్వాత తొలి సారి ఏడు వేల లోపుకు చేరింది. కరోనా ఫస్ట్ వేవ్ విపరీత స్థాయిలో విజృభించడం మొదలైంది 2020 జూన్ లోనే. అప్పటికి కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ నుంచి కాస్త మినహాయింపులు మొదలయ్యాయి.
ఏప్రిల్, మే నెలల్లో కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలు అమలు కాగా, జూన్ నుంచి మినహాయింపులు మొదలయ్యాయి. సరిగ్గా ఆ సమయం నుంచినే కరోనా చిన్న స్థాయి పట్టణాలకూ, పల్లెలకు కూడా పాకింది.
దీంతో కేసుల సంఖ్య రోజువారీగా శరవేగంగా పెరగడం మొదలైంది. మే నెలాఖరులో రోజువారీగా ఐదారు వేల స్థాయికి కేసుల సంఖ్య చేరగా.. జూన్ ఆరంభం నుంచి రోజువారీగా కేసులు ఏడు వేలు, ఎనిమిది వేలకు చేరాయి. ఆ తర్వాత కేసుల సంఖ్య భారీ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
ఫస్ట్ వేవ్ లో పూర్తిగా సద్దుమణిగిన గత ఏడాది డిసెంబర్ నెలలో కూడా రోజువారీగా పది వేల స్థాయిలో కేసులు వచ్చాయి. ఫస్ట్ వేవ్ పూర్తయిందనుకున్న తరుణంలో కూడా ఎప్పుడూ రోజువారీ కేసులు ఎనిమిది వేలకు తగ్గలేదు. అసలు కరోనా లేదనుకున్న ఆ తరుణంలో కూడా ఆ స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
ఇక ఆ తర్వాత సెకెండ్ వేవ్ విజృంభణ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విపరీత స్థాయికి వెళ్లాయి కేసులు. కొన్నాళ్ల నుంచి రోజువారీ కేసుల సంఖ్య తక్కువగానే నమోదవుతోంది.
ఇప్పుడు ఒమిక్రాన్ భయాలు పెరుగుతున్నాయి. అయితే దేశంలో దాదాపు ఏడాదిన్నర తర్వాత అత్యల్ప స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 2020 జూన్ తర్వాత.. 2021 నవంబర్ నెలాఖరులో తక్కువ స్థాయిలో కేసులునమోదు కావడం గమనార్హం.
గత ఇరవై నాలుగు గంటల్లో మొత్తం ఆరు వేల తొమ్మిది వందల కేసులు నమోదయ్యాయి. దీంతో చాలా నెలల తర్వాత తొలిసారి రోజువారీ కేసుల సంఖ్య ఏడు వేల లోపుకు తగ్గినట్టైంది. ఫస్ట్ వేవ్ పూర్తిగా ముగిసిందనుకున్నదశలో కూడా ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఇప్పుడే అది జరుగుతూ ఉంది.