సమస్యలు నిజంగా పరిష్కారం కావాలంటే అధికారంలో ఉన్నవారి దృష్టికి తీసుకెళ్లాలి, రాజకీయం చేయాలంటే మాత్రం ప్రతిపక్షాలను కలవాలి. రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి రాజకీయ ఎత్తుగడలే ఎక్కువగా జరుగుతున్నాయి. సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ దగ్గరకు వెళ్లకుండా, ప్రతిపక్షనేత చంద్రబాబుని వెళ్లి కలుస్తున్నారంటే ఏమనాలి.
తాజాగా అన్న క్యాంటీన్ ఉద్యోగుల సంఘం ఒకటి చంద్రబాబుని కలిసి తమకు ఉపాధి పోయిందని మొర పెట్టుకుందట. దీనిని పచ్చ మీడియా భలేగా ప్రొజెక్ట్ చేసుకుంది. అన్న క్యాంటీన్ల మూసివేత వల్ల పేదలు ఇబ్బంది పడుతున్నారంటే అర్థం ఉంది, అవి తాత్కాలిక ఉద్యోగాలని తెలిసి మరీ క్యాంటీన్లలో పనికి కుదిరిన వాళ్లు మా ఉపాధి పోయిందంటే ఏమనాలి. పోనీ ఉపాధి పోయిందనే అనుకుందాం. సమస్యను పరిష్కరించేవారు ఎవరు? సీఎం జగనా, చంద్రబాబా?
చడీచప్పుడు లేకుంగా నేరుగా వెళ్లి చంద్రబాబుని కలిసి గోడు వెళ్లబోసుకుంటే సమస్యను ఎవరు పరిష్కరిస్తారు. అసలీ ఉద్యోగ సంఘం ఉన్నట్టే ఎవరికీ తెలియదు, అన్న క్యాంటీన్ ఉద్యోగుల సంగతి తెలుసుకుని టీడీపీ నేతలే వారిని ఒక్కచోటకు చేర్చి బాబు దగ్గరకు పంపించారు. అప్పటికప్పుడే ఓ ఉద్యోగ సంఘం పెట్టించి, వారికో బ్యానర్ రాయించి జగన్ వీరికి అన్యాయం చేసినట్టు, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాటం చేస్తానన్నట్టు బిల్డప్ ఇచ్చారు టీడీపీ నేతలు.
ఇంతకంటే దిక్కుమాలిన, సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా, ఎలాంటి సమస్యలు పరిష్కరించడం చేతకాని చంద్రబాబు, ప్రతిపక్షంలోకి వచ్చి తగుదునమ్మా అంటూ అందర్నీ పోగేసుకుని ప్రభుత్వంపై పోరాటం చేస్తానంటే ఎలా నమ్మాలి. రాష్ట్రంలో ప్రతి చిన్న సమస్యని రాజకీయం చేయాలని చూస్తున్న బాబు అండ్ టీమ్ ఇకనైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకుంటే బాగుంటుంది.