కోడెల శివప్రసాద్ సంతానం చేసిన పనులపై తీవ్ర విమర్శలు ఈ నాటివి కావు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కోడెల తనయుడు, కోడెల కూతురు మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వారు గుంటూరు జిల్లాలో కే ట్యాక్స్ పేరుతో వసూళ్లు సాగిస్తూ ఉన్నారనే వార్తలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంతసేపూ ఆ విషయంలో ఫిర్యాదు చేయడానికి ఎవరికీ ధైర్యం చాల్లేదు.
అయితే టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత అనేకమంది బయటకు వచ్చారు. తాము కట్టిన కే ట్యాక్స్ వివరాలను పేర్కొన్నారు. పోలిసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించి విచారణలు సాగుతూ ఉన్నాయి.
గమనించాల్సిన అంశం ఏమిటంటే కోడెల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ గా ముందుకు రావడంలేదు.
తమపై జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలు చేపట్టాడని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అయితే కోడెలకు సపోర్ట్ గా మాత్రం ఇప్పటి వరకూ ఒక్క తెలుగుదేశం నేత కూడా మాట్లాడలేదు.తెలుగుదేశం వాళ్లే ఈ విషయంలో స్పందించడం లేదంటే, కోడెల దూడల కథేంటో తెలుసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఆ సంగతలా ఉంటే.. కోడెల కూతురు, కొడుకును టీడీపీ నుంచి సస్పెండ్ చేయడానికి రంగం సిద్దం అవుతున్నట్టుగా తెలుస్తోంది.
స్థానిక తెలుగుదేశం నేతలు, కార్యకర్తల ఫిర్యాదుల మేరకు ఇలా కోడెలపై చర్యలు తీసుకోబోతున్నట్టుగా కలరింగ్ ఇవ్వబోతున్నారట. తద్వారా తమ పార్టీ ఇమేజ్ పెరుగుతుందని లోకేష్ సన్నిహితులు లెక్కలేస్తున్నారట. మరి దీన్నే చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం అంటారేమో అని పరిశీలకులు అంటున్నారు.