ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ సురభి అహ్లూవాలియా గురువారం విడుదల చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో అణుబాంబు పేల్చినంత పనైంది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌తో పాటు టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మరికొందరు టీడీపీ ముఖ్యుల సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో రూ.2 వేల కోట్లకు పైగా నగదు అక్రమ లావాదేవీలు జరిపినట్టు గుర్తించామని ఆదాయపు పన్నుశాఖ కమిషనర్ వెల్లడించారు.
ఈ అక్రమ లావాదేవీలకు సంబంధించి అనేక పత్రాలతోపాటు ఈ–మెయిళ్లు, వాట్సాప్ మెసేజ్‌లను ఆదాయపు పన్నుశాఖ సేకరించింది. విదేశీ అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను గుర్తించింది. మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థల నుంచి బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా రూ.2 వేల కోట్లకుపైగా నగదును అక్రమంగా తరలించినట్లు తేల్చింది.
ఇప్పుడు బాబు భవిష్యత్‌పై ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. చంద్రబాబుపై విచారణ ఏ విధంగా జరుగుతుంది? ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది లాంటి చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి.
ఐటీ విడుదల చేసిన నోట్లోని అంశాలను పరిశీలిస్తే ఇది ఆశామాషీ కేసు కాదని అర్థమవుతుంది. అందులోనూ ఇవి ప్రాథమిక వివరాలు మాత్రమే. ఇంకా దర్యాప్తు లోతుల్లోకి పోతే ఇంకా ఎన్నెన్ని అక్రమాలు వెలుగు చూస్తాయోననే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు మాజీ పీఎస్ నివాసంలో ఐటీ సోదాలు సందర్భంగా ఈడీ, జీఎస్టీ అధికారులు కూడా పాల్గొనడం గమనించాల్సిన అంశం.
మొదటగా ఈ కేసులో ఐటీ పూర్తిస్థాయిలో విచారణ జరపనుంది. తీగ లాగితే ఎక్కడెక్కడి డొంకలు కదులుతాయో ఐటీ అధికారుల అంచనాకే అందడం లేదు. ఎందుకంటే ఇటీవల ముంబై కేంద్రంగా పని చేసే ఒక బడా కాంట్రాక్టు సంస్థ కార్యాలయంలో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో రూ.150 కోట్లకుపైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యుడికి అక్రమంగా చేరినట్లు ఐటీ శాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో అందరి చూపు చంద్రబాబుపైనే మళ్లింది. కానీ అధికారికంగా ఆధారాలు లేకపోవడంతో బయటకి మాట్లాడలేక పోయారు.
ముంబయ్‌లో దొరికిన ఒకే ఒక్క ఆధారాన్ని పట్టుకుని కూపీ లాగిన ఐటీ అధికారులకు దిమ్మ తిరిగే నిజాలు తెలిసొచ్చాయి. ఆ ఆధారాలను పట్టుకుని చంద్రబాబు ముఖ్య అనుచరుడైన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రా, ఆర్వీఆర్ ఇన్ఫ్రా, లోకేష్ బినామీ నరేన్ చౌదరికి చెందిన డీఎన్సీ ఇన్ఫ్రా కార్యాలయాలపై ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రాథమికంగా రూ.2వేల కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు.
ప్రస్తుతానికి వస్తే ఐటీ అధికారుల విచారణ అనంతరం యాంటీ మనీ లాండరింగ్ (ఎఎమ్ఎల్) కోణంలో దర్యాప్తు చేపట్టవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో డబ్బు మార్పిడి చేస్తూ నల్ల ధనాన్ని మార్పిడి చేసే ఆర్థిక నేరం కింద ఈ కేసు వస్తుందనేది నిపుణుల అభిప్రాయం. నల్లధనాన్ని అరికట్టడానికి 2005లో ఈ కొత్త చట్టాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ కేసులో నేరం రుజువైతే శిక్ష కూడా చాలా తీవ్రంగా ఉంటుందంటున్నారు. ఆ తర్వాత ఈడీకి రెఫర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈడీ తర్వాత ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్) దర్యాప్తు కూడా చేపట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
ఎలాగైతే అమరావతిలో చంద్రబాబు సర్కార్ ల్యాండ్ ఫూలింగ్ చేపట్టిందో…అదే విధమైన ఫార్ములాను కూడా ఈ అక్రమ లావాదేవీల వ్యవహారంలో కూడా వాడింది. వార్షిక టర్నోవర్ రూ.2 కోట్లకు మించకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని సాకుగా తీసుకుని రూ.2 కోట్లకు మించకుండా పెద్ద ఎత్తున బోగస్ కాంట్రాక్టు సంస్థలను సృష్టించి రూ.2 వేల కోట్ల సొమ్మును ఫూల్ చేశారు. దీన్ని ఐటీ శాఖ పసిగట్టి…అందుకు తగ్గ చర్యలు తీసుకొంది.
మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అనుమానించినట్టుగానే చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. ఇప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇక సంబంధిత శాఖ అధికారులు అధికారికంగా బాబు అవినీతి, అక్రమ లావాదేవీలపై ఆమోద ముద్ర వేయడమే తరువాయి. ఇక బాబు అండ్ కోకు శిక్షలంటారా….ఇప్పటికే ఆయన మానసికంగా నరకయాతన అనుభవిస్తున్నాడు. మిగిలింది ఒక్క జైలు ఊచలు లెక్క పెట్టడమే.