ఫోన్ టాపింగ్ పేరుతో చంద్రబాబు కొత్త కుట్రకోణానికి తెరలేపారని అవంతి శ్రీనివాస్ విమర్శించారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ కొత్త పథకం పెట్టినప్పుడల్లా కొత్త ఆరోపణతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు పన్నాగం పన్నుతున్నారని మండిపడ్డారు.
పథకాలకు వస్తున్న ఆదరణతో తమకు పుట్టగతులుండవన్న నిరాశతో చంద్రబాబు ఉన్నారని, అభద్రతాభావంతో మంచి పనులకు అడ్డుతగులుతూ అభాసుపాలవుతున్నారని ఎద్దేవా చేశారు.
‘జేబు మీడియాను అడ్డుపెట్టుకొని అసత్య ఆరోపణలతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు. ఫోన్ టాపింగ్‌పై ఆధారాలు ఉంటే ఇవ్వమని డీజీపీ కోరినా ఎందుకు ఇవ్వలేదు? దుర్మార్గుడని తిట్టిన నోటితోనే ప్రధాని మోదీని ఇప్పుడు చంద్రబాబు పొగుడుతున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం చంద్రబాబు. అన్నిప్రాంతాలు ఓట్లేస్తేనే మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని చంద్రబాబు మర్చిపోయారు.
ఒక ప్రాంతానికి, ఒక వర్గానికే పరిమితమయ్యి తన స్థాయిని తగ్గించుకున్నారు. సొంతంగా ఆలోచించినంతకాలం చంద్రబాబు రాజకీయం బాగుండేది. కొడుకు లోకేష్ ఆలోచనలతో పనిచేసి 23 సీట్లకు పార్టీ స్థాయిని దిగజార్చారు. లోకేష్ మాటలు వినటం మానకుంటే ఆ సంఖ్య మూడుకు పడిపోవటం ఖాయం’ అని అన్నారు.