టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన సామాజిక వర్గానికి భారమయ్యారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏ మాత్రం కొత్త నాయకత్వం దొరికినా…బాబును విడిపించుకునేందుకు ఆ సామాజికవర్గం సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. బాబు అవకాశవాద, స్వార్థపూరిత రాజకీయాలు తమ సామాజిక వర్గానికి తలవంపులు తెచ్చేలా ఉన్నాయని అంటున్నారు. బాబు యూజ్ అంట్ త్రో పాలసీ పుణ్యమా అని కమ్మ వాళ్లంటే వాడుకుని వదిలేసే రకమనే భావన సమాజంలో రోజురోజుకూ బలపడడం ఆ సామాజిక వర్గంలో ఆందోళన కలిగిస్తోంది.
రాజకీయాల్లో, వ్యాపారాల్లో కమ్మ సామాజిక వర్గానిది ప్రత్యేక స్థానం. కమ్యూనిస్టు రాజకీయాలు మొదలుకుని బూర్జువా రాజకీయాల వరకు కమ్మ సామాజిక వర్గం అద్వితీయ పాత్రను పోషించింది. ఇక చిత్ర పరిశ్రమలో వాళ్ల ఆధిపత్యం గురించి చెప్పాల్సిన పనే లేదు.
ముఖ్యంగా రాజకీయాల్లోకి వస్తే ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి కమ్మ సామాజిక వర్గానిది క్రియాశీలక పాత్ర అని చెప్పాలి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెలుగు సమాజాన్ని ఎక్కువ కాలం కమ్మ సామాజికవర్గ నేతలే పాలించారు. తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో నట సార్వభూముడు ఎన్టీఆర్ దేశ స్థాయిలో తిరుగులేని శక్తిగా అవతరించారు. ఢిల్లీ పాలకుల అహంకారం, అణచివేతను ధిక్కరిస్తూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ ఎన్టీఆర్ రాజకీయాలు నడిపారు.
కానీ చంద్రబాబునాయుడి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అందితే జుట్టు…అందకపోతే ఎక్కడికైనా దిగజారుతారనే పేరు ఆయన సొంతమైంది. గత కొన్నేళ్లగా చంద్రబాబు రాజకీయాలను పరిశీలిస్తే…వంచన, కుట్రలు, నిలకడలేనితనం, ఓ సిద్ధాంతానికి కట్టుబడి లేకపోవడం, అధికారం కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చడం…ఆయన నైజమయ్యాయి.
బాబుపై కమ్మ సామాజిక వర్గంలో ఎంత వ్యతిరేకత ఉందో ఆ సామాజికవర్గానికి చెందిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటలు వింటే అర్థమవుతుంది. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే…
“ఏ సమస్య వచ్చినా దానికి కులం రంగు పూయడం చంద్రబాబునాయుడుకు అలవాటైంది. కమ్మవాళ్లను భ్రష్టు పట్టిస్తున్నాడు. ఐదు నెలల్లో నాలుగు రోజులు మాత్రమే రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఉమక్ (మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు) చెప్పే దానికి ఏమైనా అర్థం ఉందా? 70 లక్షల మంది కమ్మ వాళ్లపై ఎవరు కక్ష సాధిస్తున్నారు? నాపై, మీపై ఎవరైనా కక్ష సాధిస్తున్నారా? తప్పు చేసినప్పుడు కేసు పెడితే కక్ష సాధింపు ఎలా అవుతుంది? మీకు (రమేశ్ ఆస్పత్రి) ఆరోగ్యశ్రీ బిల్లులు మొత్తం ఇచ్చినప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి మంచితనం కనపడలేదా?” అని ఆయన ప్రశ్నించారు. దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే.
దివంగత ఎన్టీఆర్ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత అయినప్పటికీ…తానెప్పుడూ బాబులా సంకుచిత స్వభావంతో వ్యవహ రించలేదు. తాను అందరివాడిగానే రాజకీయాలు చేశారు. బడుగు బలహీన వర్గాల పార్టీని టీడీపీని తీర్చిదిద్దారు. అట్టడుగున ఉన్న నిమ్న కులాల వారిని, ఏ మాత్రం ఆర్థిక స్తోమత లేని వారిని నాయకులుగా తయారు చేసిన ఘనత ఎన్టీఆర్‌ది. అందుకే ఎన్టీఆర్‌ను బడుగు బలహీన వర్గాల ప్రజలు అక్కున చేర్చుకున్నారు.
ఎన్టీఆర్‌కు రాజకీయాలంటే వ్యాపారం కాకపోవడం వల్లే అలా చేయగలిగారు. అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ చెప్పేవారు. ఆ పార్టీకి కమ్మ సామాజికవర్గం మొదటి నుంచి బలమైన అండగా నిలుస్తూ వచ్చింది. ఆర్థికంగా, హార్థికంగా కూడా ఆ సామాజిక వర్గం మద్దతుగా నిలిచింది. కానీ దివంగత ఎన్టీఆర్‌కు ఈ కుల కంపు పట్టేది కాదు. ఆయన అందరివాడు. అందుకు తగ్గట్టుగానే పదవులు, ఎన్నికల్లో సీట్ల పంపకాలు చేశారు. సామాన్యులకు టికెట్లు ఇచ్చి పేదల పార్టీగా గుర్తింపు తెచ్చారు. ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదుల వల్లే ఎన్ని సంక్షోభాలు వచ్చినా టీడీపీ తట్టుకుని నిలబడ గలిగింది.
కానీ చంద్రబాబు చేతిలోకి పార్టీ వెళ్లిన తర్వాత…క్రమంగా దాని రూపు రేఖలు మారిపోతూ వస్తున్నాయి. వ్యాపారులకు, సొంత సామాజిక వర్గంలోని ధనవంతులకే రాజ్యసభ, ఇతరత్రా పదవులు కట్టబెడుతూ వచ్చారు. అంతేకాదు, ఏ పార్టీకైతే వ్యతిరేకంగా టీడీపీ అవతరించిందో…ఆ మౌళిక సిద్ధాంతానికి వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుని తన పతనానికి పునాది వేసుకున్నారు.
అన్నిటికి మించి అవకాశవాద రాజకీయాలతో టీడీపీపై ప్రజల్లో నమ్మకం సడలేలా చేసుకున్నారు. రాజకీయంగా ఓ పాలసీ లేకుండా చంద్రబాబు పార్టీని నడిపించడంతో ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. ఉదాహరణకు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు…2004కు వచ్చే సరికి అదే పార్టీని తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారు. తిరిగి 2014కు వచ్చేసరికి ఏ బీజేపీ నాయకుడిని అనరాని మాటలు అన్నారో, అదే నాయకుడు మోడీకి దేశస్థాయిలో చరిష్మా ఉందని గ్రహించి పొత్తు కోసం వెంపర్లా డారు. చివరికి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు.
ఆ తర్వాత మోడీకి దేశంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని భ్రమించి…చివరికి బీజేపీతో పొత్తు రద్దు చేసుకుని ఎన్‌డీఏ నుంచి బయటికి వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీని టార్గెట్ చేసి అనరాని మాటలు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని, దాన్ని కాపాడుకోవాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం సాగించారు. చివరికి తానొకటి తలిస్తే, ప్రజలు మరోలా తలచారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం చేయడంతో తిరిగి మోడీ చల్లని చూపు కోసం సర్కస్ ఫీట్స్ వేస్తున్నారు.
రెండురోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ విషయమై ప్రధానికి చంద్రబాబు ఓ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలో “మీ సమర్థ, శక్తిమంతమైన పాలనలో దేశ భద్రత అద్భుతంగా విరాజిల్లుతోంది. మన సాయుధ దళాలు నూతన విశ్వాసాన్ని పొందాయి. మీ చాకచక్యంతో కొత్త స్నేహాలు, పొత్తులు చిగురించాయి” అని ప్రధానిపై బాబు పొగడ్తల వర్షం కురిపించారు.
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఇలాంటి ఎన్ని లేఖలు రాస్తే మాత్రం మోడీ, అమిత్‌షా మనసులు కరుగుతాయా? ఇలాంటి చేష్టల వల్ల బాబు అంటే ఉన్న గౌరవం కూడా పోదా? ప్రజలెప్పుడైనా ధిక్కార స్వభావాన్నే ఇష్టపడతారు. అలాంటి వారిని నాయకులుగా గుర్తిస్తారు, గౌరవిస్తారు. ముఖ్యమంత్రి జగన్‌లో ఇలాంటి ధిక్కార స్వభావం, మొండి పట్టుదలే ఆయన్ను తిరుగు లేని నాయకుడిగా నిలబెట్టింది.
ప్రధాని మోడీని ప్రశంసిస్తూ చంద్రబాబు లేఖ రాస్తే…బీజేపీ నేతల స్పందన ఎలా వుందో తెలుసుకోవడం ఎంతో అవసరం. చంద్రబాబు లేఖ రాసిన ఆ రోజు సాయంత్రమే బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ట్విటర్‌తో పాటు ఒక ప్రముఖ చానల్ వేదికగా బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో మోడీని బాబు ఏ విధంగా దూషించారో ఒక్కో తిట్టును పేరుపేరునా గుర్తు చేస్తూ ట్విటర్‌లో ఆయన ఏమన్నారంటే…
“అయ్యా చంద్రబాబు గారూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై మీరు చేసిన దిగజారుడు విమర్శ లను ప్రజలు మర్చిపోలేదు. స్వప్రయోజనాల కోసం అమరావతిని, రైతులను రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి రాజకీయ బలిపీఠం ఎక్కించిన విషయంలో బాబు చరిత్రలో నిలిచిపోతారు. తాజా లేఖలో మోడీకి బాబు భజన చేయడం ఏంటి? ఎందుకీ మార్పు? గతంలో ఇష్టమొచ్చినట్టు మోడీని, బీజేపీని తూలనాడారు. వాటి గురించి మరిచిపోయేంత మతిమరుపు మోడీకి, బీజేపీకి లేవు. అవసరాన్ని బట్టి భజన చేయడం మీకు మామూలే . ఈ మేరకు రాష్ట్ర , దేశ ప్రజలను క్షమాపణలు కోరాలి” అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ట్విటర్‌లో చెలరేగిపోయారు.
విష్ణువర్ధన్‌రెడ్డి వయస్సు…చంద్రబాబు రాజకీయ అనుభవమంత కూడా ఉండదని, అలాంటి పిల్ల నాయకులతో కూడా తమ నాయకుడు హితబోధ చేయించుకోవడం అవమానంగా ఉందని టీడీపీ కమ్మ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఢిల్లీలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబుకు తెలిసినంతగా, మరే నాయకుడిగా తెలియదని చెప్పడం బాబు వ్యక్తిత్వాన్ని ప్రజలకు చెప్పాలనే తపన కనిపించిందన్నారు. 14 ఏళ్లుగా తనపై కేసు విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారని, ఇదో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాల్సిన విషయమని అవహేళన చేయడం కూడా బాబు ఎలాంటి వారో చెప్పకనే చెప్పినట్టవుతోందని ఆ సామాజిక వర్గం చింతిస్తోంది.
అసలు మోడీ, అమిత్‌షా ప్రసన్నం కోసం తమ నాయకుడు ఎందుకిలా దిగజారిపోయారో అర్థం కావడంలేదని కమ్మ సామాజిక వర్గాన్ని మనోవేదనకు గురి చేస్తోంది. గతంలో ఎన్టీఆర్ ఢిల్లీని ధిక్కరించి ఒక్క కమ్మ సామాజిక వర్గాన్నే కాదని యావత్ తెలుగు సమాజం తల ఎత్తుకునేలా చేసిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బాబు మాత్రం ఛీ…అని బీజేపీ చీదరించుకుంటుంటే, కాళ్ల బేరానికి వెళుతూ ఒక్క తమ సామాజిక వర్గానికే కాకుండా తెలుగువాళ్ల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాలకుల వద్ద తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు.
ఇటీవల ఒమర్ అబ్దుల్లా చేసిన విమర్శలు దేశస్థాయిలో చంద్రబాబు పరువు తీశాయని గుర్తు చేస్తున్నారు. “టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పచ్చి అవకాశవాది. ఏ మాత్రం నమ్మదగిన నేత కాదు. రాజకీయ అవసరాలకు, మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు మమ్మల్ని చంద్రబాబు వాడుకున్నారు. మా రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తే చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు విశ్వాసఘాతకుడు” అని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. చంద్రబాబునాయుడంత డర్టీయిస్ట్ పొలిటీషియన్ మరెవరూ లేరని కేసీఆర్ విమర్శించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇలా ఏ ఒక్కరూ కూడా చంద్రబాబుది కన్నింగ్ మెంటాలిటీ అని, నమ్మిన వాళ్లని నట్టేట ముంచుతారనే అపనమ్మకాన్ని పెంచుకోవడం…మొత్తం ఆ సామాజికవర్గంపై పరోక్షంగా అనుమానపడేలా చేస్తోందని కమ్మవారు వాపోతున్నారు. అంతెందుకు దివంగత హరికృష్ణ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరే నిదర్శనంగా చూపుతున్నారు. చంద్రబాబు వల్ల కమ్మ సామాజికవర్గానికి ఒనగూరిన ప్రయోజనాల కంటే కీడే ఎక్కువని వారు అంతర్మథనం చెందుతున్నారు.
ఎన్టీఆర్‌ను కూలదోయడానికి ఆయన కుమారుడు హరికృష్ణను, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును వాడుకుని, ఆ తర్వాత కాలంలో ఎలా వదిలేశారో బాబు వంచనకు ఉదాహరణగా చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ని వాడుకుని, ఆ తర్వాత పట్టించుకోని వైనాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హరికృష్ణ కూతురిని కూకట్పల్లి నుంచి నిలిపి బలిపశువును చేసిన విషయాన్ని కూడా ఆ సామాజిక వర్గం గుర్తు చేస్తోంది.
చంద్రబాబు తాను, తన కుటుంబ ప్రయోజనాల కోసం తమ సామాజిక వర్గాన్ని వాడుకున్నారని…ఇప్పుడిప్పుడే కమ్మ కులస్తులు రియలైజ్ అవుతున్నారు. ఇక ఆయన్ని నమ్మకుంటే అసలుకే ఎసరు వస్తుందని నమ్ముతున్నారు. అంతెందుకు రాజధాని ఉద్యమానికి మరే ఇతర సామాజిక వర్గాల నుంచి మద్దతు రాకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు కుటిల మనస్తత్వం సమాజంపై వేసిన బలమైన ముద్రే అని కమ్మ సామాజిక వర్గం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది.
చంద్రబాబు వ్యక్తిత్వమే కమ్మ సామాజిక వర్గీయులదనే అపప్రదను తట్టుకునేందుకు వాళ్లు సిద్ధంగా లేరు. అందువల్లే తమకు భారంగా మారిన చంద్రబాబును తప్పించడం ఎలా అనే అంతర్మథనం ఆ సామాజిక వర్గంలో బలంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.