దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాభవం తగ్గుతుందన్న తప్పుడు అంచనాతో.. ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న నెపం పూర్తిగా ఆ పార్టీపైనే నెట్టేయాలన్న దురాలోచనతో సరిగ్గా ఎన్నికల ముందు బీజేపీకి విడాకులిచ్చారు చంద్రబాబు. అయితే ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ప్లేటు ఫిరాయించారు.
కమలదళానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాదిన్నరలో మోదీ కటాక్షం కోసం, బీజేపీ స్నేహ హస్తం కోసం బాబు చేయని పనంటూ లేదు. ఏ నోటితో మోదీని నానా మాటలన్నారో.. అదే నోటితో ఆయన గొప్పదనాన్ని ప్రశంసించారు.
ఆయన ముందుచూపుని ట్విట్టర్లో కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టాలనుకున్న ప్రతిసారీ మోదీతో పోలిక పెడుతూ రెచ్చిపోయేవారు. తన అనుకూల మీడియాతో కూడా మోదీ భజన చేయించారు. కానీ బాబు పప్పులు ఉడకడం లేదు. వస్తానొస్తానంటున్నా.. బీజేపీ మాత్రం ఛీ పొమ్మంటోంది.
పుండుమీద కారం చల్లినట్టు వైసీపీని దగ్గరకు తీస్తోంది. పనిలో పనిగా ఏపీ బీజేపీ.. టీడీపీ నేతలకు గాలమేస్తోంది. ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించేది మేమేనంటోంది. బీజేపీకి, వైసీపికి మధ్య పుల్లలు పెట్టాలనుకుంటున్న చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఆశలు అడియాశలే అయ్యాయి.
జమిలి అంటూ తొందర పడుతున్న ఈ దశలో చంద్రబాబు ప్లాన్ మారుస్తారా. వైసీపీని, బీజేపీని ఒకే గాటన కట్టి విమర్శలు మొదలు పెడతారా? వైసీపీతో పాటు, బీజేపీపై కూడా విరుచుకు పడటం వల్ల చంద్రబాబుకి కలిగే ప్రయోజనం ఏదైనా ఉంటుందా..?
బాబు ప్లాన్ బి ఏంటి?
బీజేపీతో దోస్తీ చేయాలనే ప్లాన్-ఎ వర్కవుట్ కాకపోవడంతో ప్లాన్-బి గురించే బాబు ఆలోచిస్తున్నారు. వైసీపీ, బీజేపీని ఒకే గాటన కట్టి మెల్లగా జనసేనను వారి నుంచి దూరం చేయాలనేది బాబు ప్లాన్ బి గా తెలుస్తోంది.
బీజేపీతో వైసీపీకి తగాదా పెట్టడం కుదర్లేదు కాబట్టి.. వారిద్దరికీ లేని సయోధ్యను తెచ్చిపెట్టి జనసేనను బైటకు లాగాలనుకుంటున్నారు. ఎలాగూ జగన్ అంటే.. పవన్ కి పీకల దాకా కోపం ఉంది.
ఆ కోపాన్ని, ఇగోని మరింత రెచ్చగొట్టి జనసేనానిని తమవైపు తిప్పుకునే ఆలోచనలో ఉన్నారు బాబు. అయితే ఇది చివరిగా ప్రయోగించే అస్త్రం మాత్రమే. బీజేపీ ఇక తనని నమ్మదు, బీజేపీతో పొత్తు అసాధ్యం అనుకున్నప్పుడే బాబు ఈ ప్లాన్ అమలులో పెడతారు.
పొత్తుల్లేకుండా సింగిల్ గా వెళ్లిన ప్రతిసారి బాబు ఓడిపోయారు. ఈసారి కూడా అలా సింగిల్ గా వెళ్తే.. ఇరవై మూడు సీట్లు కాస్తా రెండుకో, మూడోకో పడిపోతాయనేది బాబు భయం. అందుకే ప్లాన్-ఎ ఫెయిలైనా, ప్లాన్ బి అమలు చేయాలనేది బాబు వ్యూహం.