విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతున్న నోటితోనే చంద్రబాబు విషం కక్కుతున్నారు. విశాఖవాసులంటే తనకు నిండుగా, మెండుగా ప్రేమాభిమానాలు ఉన్నాయని అంటూనే వారికి ఏవీ ఇవ్వాల్సిన అవసరం లేదని సెలవిస్తున్నారు.
ఎందుకంటే విశాఖవాసులు సౌమ్యులు, మంచివారు, వారికి రాజధాని ఎందుకు అన్నది బాబు మార్క్ లాజిక్కు. అంటే ఎదురుగా ఉన్న సముద్రమంత మంచితనంలో అలా బతికేయగలరు, వారికి రాజధాని హోదాలు అవీ ఎందుకు అంటూ బాబు తన అక్కసును చెప్పకుండానే చెప్పేసుకుంటున్నారు. విశాఖవాసులు రాజధాని గురించి అడగలేదుట. వారు నీతికి నిజాయతీకి కట్టుబడినవారుట. అంటే ఎవరైనా, ఎక్కడైనా అభివ్రుధ్ధి కోరుకుంటే వారికి నీతి లేనట్టా. బాబు వితండవాదం ఇలా పరాకాష్టకు చేరుతోంది మరి.
అమరావతి రైతుల పొట్టగొట్టి తమకు రాజధాని ఇమ్మనమని విశాఖ జనం ఎప్పటికీ అడగరట. అందువల్ల విశాఖ వాసులు కోరని రాజధానిని జగన్ ఎందుకు ఇవ్వడం, అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచేయవచ్చు కదా అంటూ సుతి మెత్తని సుద్దుల మాటున విశాఖ మీద కక్షను బాబు బయటేసుకుంటున్నారు.
ఇక్కడ బాబు చెబుతున్న మాటలు చూస్తూంటే ఏదీ అడగకుండా కుక్కిన పేనుగా ఉన్న ప్రాంతాలు అంటే బాబు గారికి మహా ఇష్టమని తేలుతోంది. విభజన జరిగిన వెంటనే విశాఖను రాజధాని చేయమంటూ నాడు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ ఇదే విశాఖలో జరిగింది. మేధావులు సదస్సులు పెట్టి తీర్మానాలు పంపించారు. ఉత్తరాంధ్రాను బాగు చేసేలా విశాఖను కనీసం రెండవ రాజధాని చేయమని ప్రజా సంఘాలు అర్ధించాయి. మరి నాడు సీఎంగా ఉన్న బాబు వాటిని తోసిపుచ్చి అమరావతి అంటూ కొత్త సినిమా చూపించారు.
తీరా చేస్తే అయిదేళ్ల కాలంలో బాబు సగటున నెలకు ఒకసారి వంతున విశాఖకు వచ్చి జాతీయ అంతర్జాతీయ సదస్సులు ఇక్కడే పెట్టారు. విశాఖ అందాలనే చూపిస్తూ వచ్చిన అథిథులను మభ్యపెట్టారు. మరి ఇవన్నీ ఆయన మరచిపోయినా జనం మరచారనుకోవడమే తప్పు. అయినా అభివ్రుధ్ధి అనేది అడగకుండానే పాలకులు చేయాలి. వారిని గొప్ప పాలకులు అంటారు, అడిగితే చేసే వారిని సాధారణ పాలకులు అంటారు. అడిగినా అరచి గీ పెట్టినా చేయని వారిని అధమ పాలకులు అంటారు. బాబు ఇందులో తాను ఎక్కడ ఉన్నానో తెలుసుకుంటే మంచిదని మేధావులే సెటైర్లు వేస్తున్నారు.