అధికారం చేపట్టి ఏడాది పూర్తయ్యే లోగా సీఎం జగన్ దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు. తాజాగా వెలువడిన ఓ సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో జగన్ మూడో స్థానం సాధించారు. ఈ లిస్ట్ ఓసారి చూస్తే జగన్ కి ఉన్న సమర్థత ఏంటో అర్థమవుతుంది.
మొదటి స్థానంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ కి ముఖ్యమంత్రిగా మూడేళ్ల అనుభవం ఉంది, కేంద్రంలో బీజేపీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి దశలో యోగికి ఫస్ట్ ప్లేస్ రావడంలో ఆశ్చర్యం లేదు, రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారం చేపట్టడం ఇది రెండో దఫా. ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న ఢిల్లీ రాష్ట్రాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తుండటంతో పాటు, కేంద్రానికి ఎదురొడ్డి నిలవడంతో ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ఇలాంటి ఉద్ధండులందర్నీ వెనక్కు నెట్టి జగన్ మూడో స్థానం కైవసం చేసుకోవడమే ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎందుకంటే జగన్ తొలిసారి సీఎం అయ్యారు కాబట్టి.
దాదాపు ఏడాది క్రితం వరకు జగన్ ఓ ప్రతిపక్ష నేత మాత్రమే. అధికార పార్టీగా టీడీపీ చేస్తున్న అరాచకాలను ఎదిరించి, పార్టీని, నేతల్ని, కేడర్ ని కాపాడుకుంటూ ఆయన చేసిన పోరాటం అసమాన్యం. అది దేశానికి తెలియకపోవచ్చు కానీ.. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రభ వెలిగిపోతోందనడానికి ఈ సర్వేనే నిదర్శనం.
ఏడాది కాలంలో మేనిఫెస్టోలోని హామీలన్నిటినీ అమలులో పెట్టిన సీఎం బహుశా భారతదేశ చరిత్రలో ఇంకెవరూ ఉండరేమో. అందులోనూ ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రం, టీడీపీ చేసిన అప్పుల కుప్ప ఓవైపు, వ్యవస్థల్లో మేటవేసిన అవినీతి మరోవైపు.. అన్నిటినీ గాడిలో పెట్టుకుంటూ పాలనలో తనదైన ముద్రవేశారు జగన్.
రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియతో దేశవ్యాప్తంగా చర్చకు తెరతీశారు. పాలన అంటే పారదర్శకంగా ఉండాలని చాటి చెప్పారు. సచివాలయ వ్యవస్థ కూడా దేశవ్యాప్తంగా జగన్ పేరు మారుమోగేలా చేసింది. ప్రతి గ్రామంలో, పట్టణాల్లోని ప్రతి వార్డులో అధికారులు అందుబాటులో ఉండేలా సచివాలయ వ్యవస్థను రూపొందించి దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారు.
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెట్టే ప్రయత్నం, చేతి వృత్తుల వారికి, ఆటో డ్రైవర్లకు, దర్జీలకు అండగా ఆర్థిక సాయం అందించడం.. ఒకటేంటి.. నవరత్నాల్లో ఉన్న ప్రతి కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అంటే అతిశయోక్తి కాదు. ఓ దశలో జగన్ చేపట్టిన పథకాల వల్లే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆర్టీసీ విలీనం వంటి అంశాల్లో ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఇక కరోనా కష్టకాలంలో టెస్టింగ్ కిట్ లను స్థానికంగా తయారు చేసిన తొలి రాష్ట్రం ఏపీనే కావడం విశేషం. ఓ దశలో దేశవ్యాప్తంగా కొవిడ్ టెస్ట్ లు అత్యథికంగా చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. మరణాల రేటు కూడా ఇతర రాష్ట్రాలతో, దేశ సగటుతో పోల్చితే ఏపీలో అతి తక్కువ.
సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న జగన్, సంచలన పథకాలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ క్రమంలో ఇప్పటికి మూడో స్థానానికి చేరుకున్న జగన్.. రాబోయే రోజుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించడం ఖాయం. మొదటి స్థానానికి చేరుకునే మొదటి మెట్టు ఈ మూడో స్థానం.