బాబు తాపత్రయం.. ఎన్నికలనాటికి ఆ ముద్ర పోవాలి

చంద్రబాబుపై ఎన్నో రకాల విమర్శలు చేస్తుంటారు వైసీపీ నేతలు. అంశాల వారీగా బాబుపై విమర్శలు మారిపోతుంటాయి. అయితే ఎన్ని అంశాలు మారినా, ఎన్ని కాలాలు మారినా, ఎన్నేళ్లు గడిచినా బాబుపై కామన్ గా వినిపించే…

చంద్రబాబుపై ఎన్నో రకాల విమర్శలు చేస్తుంటారు వైసీపీ నేతలు. అంశాల వారీగా బాబుపై విమర్శలు మారిపోతుంటాయి. అయితే ఎన్ని అంశాలు మారినా, ఎన్ని కాలాలు మారినా, ఎన్నేళ్లు గడిచినా బాబుపై కామన్ గా వినిపించే సెటైర్ మాత్రం ఒకటుంది? హైదరాబాద్ లో అద్దాల మేడ కట్టుకొని, టూరిస్ట్ పొలిటీషియన్ లాగ ఆంధ్రకు వస్తారనేది ఆ కామన్ కామెంట్.

వైసీపీ నేతలు ప్రతిసారి చేసే ఈ విమర్శ, ఇప్పటికిప్పుడు చంద్రబాబుపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఇదే వైసీపీ నేతల ప్రధాన ఆయుధంగా మారేలా ఉంది. ఎన్నికల టైమ్ లో బాబు కోసం ఏపీ టీడీపీ నేతలంతా హైదరాబాద్ కు అప్ అండ్ డౌన్ చేస్తుంటే కచ్చితంగా అది వైసీపీకి విమర్శనాస్త్రమే అవుతుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

అందుకే ఇప్పుడీ మచ్చను తొలిగించుకోవడానికి సిద్ధపడుతున్నారు చంద్రబాబు. ఇన్నాళ్లూ కరకట్టపై అద్దె ఇంట్లో ఉన్న బాబు, ఇప్పుడు బెజవాడలో స్థిరనివాసం కోసం చూస్తున్నారు. ఎన్నికలనాటికి ఓ ఇల్లు కట్టుకొని తనది కూడా లోకల్ అని చాటిచెప్పే ప్రయత్నంలో ఉన్నారట. దీనికోసం విజయవాడ-మంగళగిరి మధ్య మంచి స్థలం కోసం వెదుకుతున్నట్టు తెలుస్తోంది. స్థలం దొరికిన వెంటనే, కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నారు.

గతంలో జగన్ పై ఇలానే..!

గతంలో జగన్ పై సరిగ్గా ఇలాంటి విమర్శలే చేసేవారు చంద్రబాబు. లోటస్ పాండ్ లో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారని, ఏపీ ప్రజలంటే చిన్న చూపు అని, అసలు ఏపీలో అడుగు పెట్టే అర్హత కూడా లేదంటూ జగన్ పై ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేసేవారు. అయితే జగన్ ఏం చేసినా మంచి టైమ్, టైమింగ్ చూసి చేస్తారనే విషయం తెలిసిందే. 

టీడీపీ విమర్శలకు తన చేతలతో సమాధానం చెప్పారు. ఎన్నికలకు ముందే తాడేపల్లిలో ఇంటితో పాటు, పార్టీ ఆఫీస్ కూడా పెట్టి అందరి నోళ్లు మూయించారు.

ఇప్పుడు చంద్రబాబు వంతు..!

ఎప్పుడైతే ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్కయిపోయి, ఏపీకి పరుగెత్తుకొచ్చారో, అప్పట్నుంచే బాబుపై ఈ విమర్శలు మొదలయ్యాయి. రావడం రావడమే, బాబు కరకట్ట అక్రమ నిర్మాణంలోకి దిగడం, వైసీపీ నేతలకు అనుకోని వరంగా మారింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకొని, అందులోనే ఉండడంతో బాబుపై విమర్శలు మరింత పెరిగాయి. 

చుట్టం చూపుగా ఏపీకి వస్తున్నారని, వచ్చామా-తిన్నామా-వెళ్లిపోయామా అన్నట్టు ఉండాలని, రాజకీయాలు చేయొద్దని వైసీపీ నేతలు ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. వీటన్నింటికీ సొంత ఇంటి నిర్మాణంతో చెక్ పెట్టాలనుకుంటున్నారు చంద్రబాబు. 

ఎన్నికల నాటికి తన స్థానికతను ఎవ్వరూ ప్రశ్నించకుండా, టూరిస్ట్ పొలిటీషియన్ అనే విమర్శలు వినిపించకుండా చేయడానికి బాబు ఇలా ముందుగానే రెడీ అవుతున్నారు. ప్లానింగ్ బాగానే ఉంది కానీ ఏపీకి చంద్రబాబు ఒక్కరే వచ్చి, హైదరాబాద్ అద్దాల మేడలో లోకేష్ ను ఉంచితే, మళ్లీ అదో సమస్య.