తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు అధ్యక్షులుంటారు. ఇవి డమ్మీ పదవులే. అయితే తెలంగాణలో ఆ డమ్మీ పదవి తీసుకోడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు తెగ టెన్షన్ పడ్డారు.
తెలంగాణలో పార్టీ లేదు..బొక్క లేదు (ఇది ఏపీ టీడీపీ అధ్యక్షుడి డైలాగ్) అనే అపవాదు వస్తే తన జాతీయ అధ్యక్ష పదవికి ఎసరు వస్తుందని ఇక టీడీపీని ఎవరూ జాతీయ పార్టీ అనరని ఆందోళనకు గురయ్యారు. టెన్షన్లో ఉన్న బాబుకి చివరిగా ఓ బకరా దొరికారు. దీంతో చంద్రబాబు జాతీయ అధ్యక్ష పదవికి మరికొన్నాళ్లు ఢోకా లేకుండా పోయింది.
అయితే ఇప్పుడు తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన బక్కని నర్సింహులు గతంలో కాంగ్రెస్ నేత కావడం విశేషం. (ఆ మాటకొస్తే చంద్రబాబు ది కూడా కాంగ్రెస్ వారసత్వమే). ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నర్సింహులుని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా చేశారు చంద్రబాబు. పక్క రాష్ట్రంలో కూడా తమ పార్టీకి ప్రెసిడెంట్ ఉన్నారని మమ అనిపించారు.
టీడీపీ దీన స్థితికి పరాకాష్ట
ఎల్.రమణ వెళ్లిపోయిన తర్వాత ఆ స్థానంలోకి రావడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఆ పదవితో ఉపయోగం లేదు, ఆ పదవి వల్ల వచ్చే లాభం లేదు. అందుకే ఎవ్వరూ ముందుకు రాలేదు. రమణ తర్వాత చాలామందికి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి మీకు టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పారు. అవతలివాళ్లు ఎగిరి గంతేస్తారనుకున్నారు బాబు, కానీ వ్యక్తిగత కారణాలతో మాకీ పదవి వద్దు అని చెప్పేసి తప్పించుకున్నారు వారంతా.
మిగతా పార్టీల్లో అవకాశం లేక టీడీపీతో కాలం నెట్టుకొస్తున్నారు కానీ, అది దొరికితే ఎవరూ టీడీపీలో ఉండరు. దీంతో జాతీయ పార్టీ అధ్యక్షుడనే పదవి అవసరమా అనే అనుమానం మొదలైంది. ఈ అనుమానం అందరిలో బలపడేలోగా చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి నర్సింహులిని ఒప్పించారు.
ఉపయోగం లేని పదవులను ఎవరో ఒకరికి కట్టబెట్టి మేం బీసీలకు న్యాయం చేశాం, మైనార్టీలకు పదవి ఇచ్చాం, ఎస్సీలను నెత్తిన పెట్టుకున్నాం అని చెప్పుకునే అలవాటు టీడీపీకి ఎప్పటినుంచో ఉంది. తాజాగా మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేశామని, తమ పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టామని గొప్పగా చెప్పుకుంటోంది టీడీపీ.
ఎవరూ గతిలేక చివరికి ఆ పోస్ట్ ఇచ్చి బక్కని నర్సింహులిని బకరా చేసింది కాక.. ఆయన సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని కూడా రాజకీయం చేయాలనుకుంటోంది.