ఆ విషయంలో బాబు, బాలయ్య సేమ్ టు సేమ్

భోగి పండగ సందర్భంగా నందమూరి ఫ్యామిలీ విడుదల చేసిన ఫొటో ఇది. తోబుట్టువుల మధ్య బాలకృష్ణ ఎంత ఎనర్జిటిక్ గా కనపడుతున్నారో చూడండి. మరి వెనకున్న బాలకృష్ణ కొడుకు సంగతేంటి..? అదిగో సినిమాల్లోకి వస్తున్నాడు,…

భోగి పండగ సందర్భంగా నందమూరి ఫ్యామిలీ విడుదల చేసిన ఫొటో ఇది. తోబుట్టువుల మధ్య బాలకృష్ణ ఎంత ఎనర్జిటిక్ గా కనపడుతున్నారో చూడండి. మరి వెనకున్న బాలకృష్ణ కొడుకు సంగతేంటి..? అదిగో సినిమాల్లోకి వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు. వారసుడొస్తున్నాడంటూ ఆమధ్య ఊదరగొట్టారు. 

కట్ చేస్తే అబ్బాయికి అలాంటివేవీ పట్టేలా లేదు. కనీసం సినిమాల్లోకి రావాలన్న ఆలోచన కూడా లేనట్టుంది. అందుకే అలాగే ఉన్నాడు. బాలకృష్ణ కొడుకు ఎలా ఉన్నా ఎవరికీ వచ్చే నష్టం లేదు. కానీ నందమూరి అభిమానులు మూడో తరం వారసుడు మరింత పవర్ ఫుల్ గా ఉండాలనుకుంటున్నారు, కానీ ఇవాళ్టి ఫొటో చూస్తే ఫ్యాన్స్ నీరుగారిపోవడం గ్యారెంటీ.

బాబు, బాలయ్య దొందూదొందే..!

సినిమా వారసుడి విషయంలో బాలకృష్ణ ఎలా ఫీలవుతున్నారో, రాజకీయ వారసుడి విషయంలో చంద్రబాబు కూడా అంతే ఫీలవుతున్నారు. బాలకృష్ణ విషయంలో వారసుడు ఇంకా తెరపైకి రాకముందే ఆయనపై అనుమానాలున్నాయి, చంద్రబాబు విషయంలో వారసుడు బరిలో దిగి ఆల్రడీ బొక్కబోర్లా పడ్డాడు. వారసత్వ బలంతో మంత్రిగా పనిచేసి కూడా చివరకు అసెంబ్లీ గేటు తాకలేక ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు లోకేష్.

ఓడిపోయినోళ్లంతా నాయకులు కాకుండా పోతారని చెప్పలేం కానీ, ఇక్కడ చినబాబులో పొలిటికల్ మేటర్ బాగా వీక్. రాజకీయ పరిజ్ఞానం అంతంతమాత్రమే, భాషాపరిజ్ఞానం, వాక్చాతుర్యం.. లాంటి వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. లోకేష్ అసమర్థుడని ఆల్రడీ రుజువైపోయింది. అందుకే ఈవయసులో చంద్రబాబు ఇంకా కష్టపడుతున్నారు. చనిపోయిన కార్యకర్త పాడె మోస్తూ సింపతీ కోసం ట్రై చేస్తున్నారు.

ఎంత చేసినా, అంతా వారసుడి కోసమేననేది బహిరంగ రహస్యం. తన తర్వాత లోకేష్ ఎలాగూ ఇబ్బందిపడతారని తెలిసి, వయసు మీద పడుతున్నా ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అధికారం చేజిక్కించుకుని, లోకేష్ కి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారు.

ఇద్దరికీ ఎన్టీఆర్ తోనే పేచీ..

విచిత్రం ఏంటంటే.. నందమూరి నట వారసుడిగా మూడో తరంలో ఎన్టీఆర్ తాత పేరు నిలబెట్టాడు. ఇప్పుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చినా కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చి చూస్తారు. ఏమాత్రం తేడా కొట్టినా జూనియర్ ఒక్కడే అసలైన వారసుడు అని తేల్చేస్తారు. ఇక్కడ లోకేష్ కి కూడా జూనియర్ తోనే పేచీ. ఓ దశలో ఖాకీ యూనిఫామ్ వేసి, టీడీపీ తరపున ప్రచార రథం ఎక్కి.. తాతను గుర్తు చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ రాజకీయాల్లో కొనసాగితే లోకేష్ కి ఇబ్బంది అని తెలివిగా పక్కకు తప్పించారు చంద్రబాబు. 

ఇప్పటికీ లోకేష్ కి ఎన్టీఆర్ నుంచి బెడద ఉంది. టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులంతా చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ చేపట్టాలని కోరుకుంటున్నారు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ తాతకు తగ్గ మనవడు ఒక్క ఎన్టీఆరేననేది వారి నిశ్చితాభిప్రాయం.

పోనీ ఎన్టీఆర్ తో పోలిక లేకపోయినా లోకేష్, మోక్షజ్ఞ తమని తాము నిరూపించుకోగలిగితేనే వారి వారి రంగాల్లో నిలబడగలుగుతారు. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకోవాలని చూస్తే మాత్రం ఈ రోజుల్లో అది సాధ్యమయ్యే పని కాదు. ఆ విషయంలో బావబామ్మర్ది ఇద్దరికీ వాళ్ల తనయుల టెన్షన్ తప్పేలా లేదు.