జనసేనాని పవన్‌కల్యాణ్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయం రంజుగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య విమర్శల స్థాయి నుంచి తిట్ల వరకూ వెళ్లింది.
ఎవరూ తగ్గట్లేదు. పవన్‌కల్యాణ్‌పై రోజుకో మంత్రి చొప్పున విమర్శల దాడి చేస్తున్నారు. సవాల్ విసురుతున్నారు. నీకు దమ్ముంటే.. ఇలా చేయ్, అలా చేయ్ అని మంత్రులు సవాళ్లు విసురుతుండడం గమనార్హం.
జనసేనానిపై విమర్శలు చేసే వంతు ఈ దఫా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వచ్చింది. బాలినేని మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
టీడీపీతో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం సరికాదని పవన్‌కు హితవు చెప్పారు. 38 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకే ఒంటరిగా పోటి చేసే దమ్ము లేదన్నారు. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఎప్పుడైనా టీడీపీ పోటీ చేసిందా? అని మంత్రి బాలినేని ప్రశ్నించారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలతో సంబంధం లేకుండా జనసేనాని పవన్ పోటీ చేసి మట్టికొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. జనసేన, టీడీపీ ఎలాంటి పొత్తుల్లేకుండా పోటీ చేస్తే, తమ పార్టీకి లాభమని వైసీపీ భావిస్తోంది.
ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీ చేస్తే నష్టమనే భావన అధికార పార్టీ వైసీపీలో ఉంది. అందుకే జనసేనానిని రెచ్చగొట్టి ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించే వరకూ ఇలాంటి విమర్శలు వైసీపీ నుంచి వస్తూనే ఉంటాయని అర్థం చేసుకోవచ్చు.