పిల్లి మెత్తనిదైతే ఎలుక ఏదో చూపించిందన్నది పాతకాలం ముతకసామెత. ఎలుక ఏదో చూపించడానికి పిల్లి మెత్తనిది అయితేనే పాజిబుల్ కాదు. ఎలుక వెనుక ఏనుగు సపోర్ట్ వుంటే కూడా రెచ్చి పోవచ్చు. తెలుగు నాట ఓ సెక్షన్ మీడియా వ్యవహారం అలాగే వుంది. తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం..చిత్తం వచ్చినట్లు రాస్తాం.
ఏమైనా అంటే మీడియా మీద దాడి అంటాం, ఇంకేం లేదు జగన్ మీడియా గొంతు నొక్కేస్తున్నాడు. మమల్ని అణగదొక్కేస్తున్నాడు అంటూ నానా యాగీ చేస్తాం. ఇంకా మాట్లాడితే కోర్టుకెక్కి ఊరట పొందుతాం. కోర్టు ముందు ఏముంటాయి కేవలం పెట్టిన కేసు మాత్రమే వుంటుంది. చిరకాలంగా మీడియాను అడ్డం పెట్టుకుని జగన్ ను నానా గత్తర చేసిన వైనం వుండదు. దాంతో ఊరట లభించేస్తుంది. ఇంకేం పీకుతావ్..అంటూ ఇంకా ఇంకా రెచ్చిపోవచ్చు.
నిజానికి రఘురామరాజు వ్యవహారానికి ఈ మీడియా వ్యవహారానికి తేడా ఏమీ కనిపించడం లేదు. తాము టార్గెట్ చేసిన జగన్ ను తమ ఇష్టం వచ్చినట్లు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెచ్చిపోయి ఏదైనా యాక్షన్ లోకి దిగితే, అమ్మో..బాబో..చూడండి ఎంత అన్యాయం చేస్తున్నాడో. ఎలా దాడి చేస్తున్నాడో అని నానా యాగీ చేయవచ్చు. లేదూ అంటే ఆ రచ్చను అలా భరిస్తూ వుండాలి.
లేటెస్ట్ గా జగన్ ఢిల్లీ పర్యటన వ్యవహారమే చూద్దాం. జగన్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఓ రోజు ఆలస్యంగా ఢిల్లీ వెళ్లారు. వెళ్లకపోతే, 'జగన్ కు లభించని అపాయింట్ మెంట్' అంటూ వీలయినన్ని చిలవలు పలవలు అల్లి గట్టిగా నెగిటివ్ స్టోరీలు వేసేయవచ్చు. లేదూ జగన్ ఢిల్లీ వెళ్లారు, అపాయింట్ మెంట్ లు దొరికాయి అనుకుందాం. ఇంకేం వుంది బెయిల్ కోసం వెళ్లారు, లేదా కోర్టు కేసుల కోసం వెళ్లారు అంటూ గ్యాసిప్ లు వండేయవచ్చు.
అక్కడికీ తృప్తి లభించలేదు అనుకుందాం. జగన్ కు అమిత్ షా చీవాట్లు అంటూ తమకు ఇప్పుడే 'బ్రేకింగ్ న్యూస్' తెలిసింది అంటూ వార్తలు వండి వార్చేయవచ్చు. ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ గురించి కనీసపు పరిజ్ఞానం వున్న జర్నలిస్ట్ లేనా వీరంతా అని అనుమానించాల్సి వస్తోంది.
జగన్ ఓ రాష్ట్రానికి సిఎమ్. ఆయన భాజపా పార్టీ సభ్యుడు కాదు. అమిత్ షా హోం మంత్రి. మరి ఏ విధంగా జగన్ కు అమిత్ షా చీవాట్లు పెడతారు? ఇది జరిగేపనేనా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగా కాంగ్రెస్ పార్టీ మంత్రులో లేదా భాజపా మంత్రులయినా ఇలా చీవాట్లు పెట్టారా? అలా వార్తలు వండారా?
నిజంగానే జగన్ దారుణమైన పాలన అందిస్తున్నారు అనుకుందాం. అది ఎవరికి లాభం? భాజపాకే కదా? ఎందుకంటే జగన్ విఫలం అయితే రాష్ట్రంలో భాజపా పుంజుకోవచ్చు కదా? అలాంటిది ఎందుకు చీవాట్లు పెట్టి, పరిస్థితిని చక్కదిద్ది జగన్ ను బలోపేతం చేయాలనుకుంటారు.
అసలు వేరే పార్టీ సిఎమ్ ను వేరే పార్టీ మంత్రి చీవాట్లు పెడతారా? ఇలా ఊహించి వార్తలు వండి వార్చడం అంటే జగన్ మరింత రెచ్చగొట్టడం కాక మరేంటీ? దమ్ముంటే ఏం చేస్తావో చేసుకో అని అన్యాపదేశంగా రెచ్చగొట్టడం కాక ఇంకేంటీ?
ఎవరైనా మన ఇంటి ముందుకు వచ్చి, నానా బూతులు తిడుతూ, నానా యాగీ చేస్తుంటే, భరించలేక బయటకు వచ్చి రెండు పీకితే, అదిగో చూడండి, ఎలా కొట్టేస్తున్నాడో, ఎలా బాధపెడుతున్నాడో అంటూ ఎదురు దాడి మొదలుపెడితే ఎలా వుంటంది? ప్రస్తుతం తెలుగునాట ఓ వర్గం మీడియా వ్యవహారం కూడా అలాగే వుంది.
ఏదో సినిమాలో చెప్పినట్లు మేం గిల్లితే గిల్లించుకోవాల్సిందే అన్నట్లుగా వుంది ఈ మీడియా వ్యవహారం. పరిథి దాటిపోతూన్న ఈ వ్యవహారం చూసి మీడియా సంఘాలు కానీ నియంతృత్వ సంస్థలు కూడా మౌనంగా వ్యవహరిస్తున్నాయి. చేతిలో మైకు వుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే భరించు నీ ఖర్మం అంటున్నాయి జగన్ ను. మా వెనుక మా దన్ను మాకుంది, నువ్వేం పీకుతావ్ అన్నట్లు సాగిపోతోంది వ్యవహారం.
2024 వరకు ఇలా భరించాల్సిందే. మళ్లీ మరోసారి జనం కనుక జగన్ ను అధికారంలో కూర్చో బెడితే అప్పటికయినా ఇక తమ పప్పులు ఉడకవు అని ఈ 'సామాజిక' మీడియా అలసిపోయి మౌనం వహిస్తుందేమో? అంత వరకు మీడియా ముసుగులో సాగుతున్న ఈ అరాచకాన్ని భరించాల్సిందే.