చిత్తూరు జిల్లా వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నుంచి ఆత్మీయ పలకరింపుతో పాటు ప్రశంసలు దక్కాయి.
తిరుమల దర్శనార్థం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనార్థం ఎన్వీ రమణ దంపతులు శుక్రవారం వెళ్లారు.
ఎన్వీ రమణకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ ఎమ్మెల్యేను చూడగానే… “ఏం భాస్కర్ బాగున్నావా? బాగా పని చేస్తున్నావ్. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ఆనందయ్య ఆయుర్వేద ఔషధం తయారీ అభినందనీయం. నువ్వు తయారు చేసిన ఔషధం నాకు కూడా అందిందయ్యా. నువ్వు ఇలాగే ప్రజాక్షేమం కోసం మంచి కార్యక్రమాలు చేపట్టాలి” అని ప్రశంసించడం విశేషం.
మరోసారి తిరుపతికి వచ్చినప్పుడు, ఖచ్చితంగా తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు వేద పాఠశాల, పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శిస్తానని చెవిరెడ్డికి తెలిపారు. మరోసారి పర్యటనలో తుమ్మలగుంట కార్యక్రమాన్ని షెడ్యూల్‌లో చేర్చాలని జిల్లా జడ్జిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశించారు. దీంతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పులకించిపోయారు.