నీతులు రాసేందుకు ఆంధ్రజ్యోతి, చెప్పేందుకే ఏబీఎన్ చానల్ ఉన్నాయే తప్ప…ఆచరణకు కాదని పదేపదే ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిరూపిస్తున్నాడు. సీఎం జగన్‌పై కోపంతో ఏకంగా బీసీలపై కూడా ప్రదర్శిస్తున్నాడు. అయితే ఈ విషయంలో ఆంధ్రజ్యోతికి తానేమీ తీసిపోనని ఈనాడు పత్రిక కూడా చంద్రబాబుకు దాసోహమంటోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు జగన్ సర్కార్ ముందడుగు వేసిన తరుణంలో…టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డి ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. 50% లోబడి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జగన్ సర్కార్ ఎన్నికలకు సమాయత్తమైంది. స్థానిక నగారా కూడా మోగింది.
అయితే టీడీపీ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు ప్రకారం బీసీలకు 24% మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయిని, దీనివల్ల అన్యాయం జరుగుతుందని టీడీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళితే…ఇదే టీడీపీ అడ్డుపడి, ఇప్పుడు సరికొత్త నాటకానికి తెరలేపింది.
ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా బీసీలకు 34% రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఇవ్వాలని సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతల మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు పడ్డ చందంగా జగన్ దెబ్బకు టీడీపీ మరోసారి విలవిలలాడుతోంది. బాబు శోకానికి ఆంధ్రజ్యోతి, ఈనాడు శృతి కలిపాయి. తాము రాసినవే నిజాలని, తాము చెబితేనే లోకానికి వాస్తవాలు తెలుస్తాయనే భ్రమలోఆ రెండు పత్రికలు ఇంకా ఉన్నాయి. బీసీల రిజర్వేషన్‌పై స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబుకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. అలాగే ఏ రాయాలో అర్థం కాక, దిక్కుతోచక జగన్‌పై విషపు రాతలను మరోసారి ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసుకొచ్చాయి.
మొదట ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ‘తాడోపేడో తేల్చుకోవాలి’ శీర్షికతో మొదటి పేజీలో బాబు ఫొటోతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కథనంలో జగన్ సర్కార్‌పై బాబు చిందులు తొక్కాడు. జగన్ బీసీల ద్రోహి అని, వారికి రిజర్వేషన్లు తగ్గించడం వల్ల 16,500 మంది బీసీలకు పదవులు రాకుండా చేశారని చంద్రబాబు విమర్శించాడు. బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లలేదని ప్రశ్నించాడు. బీసీలకు ఇప్పటి వరకూ ఉన్న 34శాతం కూడా ఇవ్వడం లేదని, చివరకు 24శాతమే అన్నారన్నాడు. అయితే ఆమాత్రం కూడా ఇవ్వడం లేదని, నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీల్లో కేవలం 10.49శాతం మాత్రమే బీసీ రిజర్వేషన్లు ఇచ్చారని ఆయన విమర్శించాడు.
ఇదెక్కడైనా జరుగుతుందా? 50% లోబడి రిజర్వేషన్లను కేటాయించిన తర్వాత, వాటి స్థానాల్లో అన్ రిజర్వ్డ్ అభ్యర్థులను నిలపడం ఎలా సాధ్యం? 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం ఏం న్యాయమో ఆయన విజ్ఞతకే వదిలేయడం తప్ప చేయగలిగేదేమీ లేదు.
అలాగే బీసీలకు జగన్ అన్యాయం చేస్తున్నారంటూ టీడీపీ నేతలైన మాజీ మంత్రులు , ఇతర నాయకులు ఆరోపించిన అంశాలకు ఆంధ్రజ్యోతి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ‘ఉన్న రిజర్వేషనూ గుటకాయ స్వాహా’ శీర్షికతో అయ్యన్నపాత్రుడు, జవహర్ ఆరోపించిన వార్తను క్యారీ చేశారు. మరో పేజీలో ‘జగన్‌ది మొసలి కన్నీరు’ శీర్షికతో ఇచ్చిన వార్తలో ఉపశీర్షికలుగా నాడు తండ్ని,నేడు తనయుడు…బీసీల వెన్ను విరిచే కుట్రః టీడీపీ అంటూ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ట్విటర్ వేదికగా విమర్శలు చేసిన వార్త ఇచ్చారు.
కానీ అధికార పార్టీ వైసీపీ 34% సీట్లను బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నసమాచారాన్ని జనానికి చేరవేయాలని ఆంధ్రజ్యోతికి అనిపించలేదు. కనీసం రెండు వాక్యాలు రాసేందుకు కూడా ఆంధ్రజ్యోతికి మనసు రాలేదు. బీసీలకు జగన్ అలా అన్యాయం చేశాడు, ఇలా ద్రోహం చేశాడని పుంఖానుపుంఖాలుగా కథలు అచ్చేయడానికి మాత్రం పేజీలకు పేజీలు కేటాయిస్తారు. ఇదీ బీసీలకు, జర్నలిజానికి ఆర్కే, ఆంధ్రజ్యోతి ఇస్తున్న విలువ. ఇలాంటి వాటిని మీడియా సంస్థలని పిలవాలా లేక మరే పేరుతోనైనా పిలవాలా?
ఇక ఈనాడు విషయానికి వద్దాం. గుడ్డికంటే మెల్ల మేలు అనే చందంగా ఈనాడు పరిస్థితి తయారైంది. ‘బీసీలకు తగ్గిన సీట్లు!’ శీర్షిక; ఉపశీర్షికః ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న చోట గణనీయంగా కోత, అలాగే ‘కొన్ని జిల్లాల్లో బీసీలకు 24 శాతం కూడా దక్కలేదు’ అనే శీర్షిక, దీనికి ఉపశీర్షికః టీడీపీ విశ్లేషణ నివేదిక అంటూ ఇండికేషన్‌తో మూడో పేజీలో సమగ్ర కథనాన్ని రాశారు. అలాగే అదే మూడో పేజీలో ‘వైకాపా నమ్మక ద్రోహం’ అంటూ పే…ద్ద శీర్షికతో బ్యానర్ వార్త ఇచ్చారు. బీసీలకు అన్యాయంపై నిరసనగా నేడు బ్లాక్‌డే; టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు అనే ఉపశీర్షికలను ఈ వార్తకు ఇచ్చారు.
ఇదే పేజీలో ‘59.85% రిజర్వేషన్ ప్రకారమే టికెట్లిస్తాం’ శీర్షికతో బీసీల కోసం జగన్ నిర్ణయంః వైకాపా అనే ఉపశీర్షికతో సింగిల్ కాలమ్ వార్త ఇచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల ధోరణులు ఎలా ఉన్నాయో…బీసీల వార్తకు ఇచ్చిన ప్రాధాన్యమే ప్రతిబింబిస్తోంది. బీసీలకు లాభం తెచ్చేదైనా సరే…తమ యజమాని చంద్రబాబుకు నష్టం వస్తుందనుకుంటే ఒక వాస్తవాన్ని ఎలా చంపుతాయో, మరుగుపరుస్తాయో కళ్లకు కట్టినట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి చూపాయి.
కావున బీసీల రిజర్వేషన్‌పై టీడీపీ, వైసీపీ వాదనల్లో ఎవరిది నిజమో, ఎవరిది అబద్ధమో ఇంతకంటే సాక్ష్యం మరొకటి ఉండదు. బాబుకు బాకా ఊదడం తప్ప నిజం వైపు నిలిచే దమ్ము, ధైర్యం ఈ రెండు పత్రికలు ఏనాడో విస్మరించాయి.