ప్చ్…అయిపోయింది…అంతా అయిపోయింది. టీడీపీ పనై పోయింది. ఇంతకాలం తన కట్టే కాలే వరకు టీడీపీ, నారా చంద్రబాబునాయుడి కోసమే పోరాటం సాగిస్తానని ప్రతిజ్ఞ చేసిన ‘ది గ్రేట్ జర్నలిస్టు ఆర్కే’ పని కూడా అయిపోయింది. అందుకే ఆయన ‘పోరాడితే వచ్చేదేమిటి?’ అంటూ ఈ వారం కొత్తపలుకులో తన నిర్వేదనను, ఆవేదనను వ్యక్తపరిచాడు. అయిపోయింది బాబోయ్…‘ఆ మొండి ఘటం జగన్‌తో ఇక నేను పోరాటం చేయలేను, మీరు చేయలేరు. సైన్యాధ్యక్షుడినైన నేనే రాయడం మానేసి అస్త్ర సన్యాసం చేస్తున్నా. ఆ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి సాధించేదేమీ ఉండదు. కావున ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. పరిస్థితి అనుకూలంగా లేదనుకున్నప్పుడు, శత్రువు ఊపుమీద ఉన్నప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గడం యుద్ధతంత్రంలో ఒక భాగం. ఇలా చేయడాన్ని పలాయన వాదంగా భావించడానికి లేదు’ అని తన ఆరాధ్య నాయకుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఈ వారం ఆర్కే ‘గీతోపదేశం’ చేశాడు.
బహుశా ఇన్నేళ్ల ఆర్కే జర్నలిజంలో ఇంత నిరాశ, నిస్పృహలకు లోనైన సందర్భం ఉండదేమో. వైఎస్ జగన్ సొంత పార్టీ వైఎస్సార్సీపీ స్థాపించినప్పటి నుంచి , ఆయనపై ఎన్నో రకాలుగా విష ప్రచారం చేసినా, చేస్తున్నా ప్రజల్లో తాను అనుకున్న వ్యతిరేకత రాకపోవడం ఆర్కేలో ఒక రకమైన వైరాగ్యాన్ని నింపినట్టుంది. అంతేకాదు జగన్ తొమ్మిది నెలల పాలనపై, ప్రతి వారం తానే స్వయంగా కులం, మతం, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా రాసిన రాతలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని ఆర్కే పశ్చాత్తాపం చెందుతున్నట్టున్నాడు.
కులం చెడినా సుఖం ఉండాలంటారు. కానీ చంద్రబాబు కోసం తాను, తన మీడియా సంస్థ జర్నలిజంతో పాటు వ్యక్తిగతంగా అన్ని నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి, బజారులో నగ్నంగా నిలబడినప్పటికీ…ఏ మాత్రం ప్రయోజనం లేకపోయిందనే ఆవేదన ఆర్కేను వెంటాడుతున్నట్టుంది. ఆయనలోని అంతర్మథనానికి ఈ వారం కొత్తపలుకులో స్థానిక సంస్థల ఎన్నికలపై వెల్లడించిన అభిప్రాయాలే నిదర్శనం.
ఆర్కే వైరాగ్యానికివే నిదర్శనం
‘తెలుగుదేశం పార్టీ ఒంటరిగా స్థానిక ఎన్నికలలో పోటీచేయడం వల్ల ఫలితం ఉంటుందా? అన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. పది మాసాల క్రితం జరిగిన సాధారణ ఎన్నికలలో ఓటమిపాలైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆర్థికంగా కూడా కుదేలయ్యారు. మెజారిటీ అభ్యర్థులు ఇప్పటికీ అప్పుల భారాన్ని మోస్తున్నారు. వారిని ఆర్థికంగా ఆదుకునే పరిస్థితిలో పార్టీ అధిష్ఠానం కూడా లేదు. ఇక కార్యకర్తలు, అభిమానుల పరిస్థితి గ్రామాల్లో దారుణంగా ఉంది. ఈ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి సర్పంచులుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా, మునిసిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఎంతమంది ముందుకు వస్తారో తెలియదు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం’
‘మరోవైపు రాజధాని అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టి మూడు నెలలు కావస్తోంది. అమరావతిని చంపేయడం వల్ల భవిష్యత్తులో జరిగే నష్టాన్ని ఇప్పటికీ ఇతర ప్రాంతాల ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ప్రస్తుతానికి రైతుల ఉద్యమ ప్రభావం కృష్ణా – గుంటూరు జిల్లాల్లో అంతోఇంతో కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో కృష్ణా – గుంటూరు జిల్లాలలో అధికార పార్టీ గెలిస్తే రాజధాని తరలింపు విషయంలో ముఖ్యమంత్రికి అడ్డు ఉండదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు… ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరించడం మంచిది’
‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం, జనసేన–బీజేపీ కూటమి మధ్య చీలిపోతుంది కనుక అధికార పార్టీనే లబ్ధిపొందుతుంది. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి, తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. అయితే అది ఏ స్థాయిలో అన్నదే ప్రశ్న. ప్రభుత్వం తీరువల్ల జరగబోయే అనర్థాలను కిందిస్థాయి జనం గ్రహించే పరిస్థితి లేదు. సంక్షేమం పేరిట తమకు డబ్బులు పంచుతున్నారు కనుక వారిలో అసంతృప్తి ఉండటానికి అవకాశం లేదు’
ఆర్కే పత్తిత్తు రాతలు
‘స్థానిక ఎన్నికలతోపాటు ఉప ఎన్నికలకు కూడా దూరంగా ఉండటం ఈ దేశంలో ప్రతిపక్షాలకు కొత్త ఏమీకాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సందర్భంలో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది’…అని ఆర్కే ఈ కథనంలో ఒకచోట రాశారు. ఇప్పుడంటే ఆ దుర్మార్గుడు జగన్ పాలన సాగిస్తున్నాడు కాబట్టి అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడనుకుందాం. మరి శ్రీరామచంద్రుడు లాంటి నారా చంద్రబాబునాయుడి పాలనలో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో ఆర్కే వివరించి ఉంటే బాగుండేది. బాబు ఏం చేసినా ఆహా, ఓహో అని కీర్తించడం అలవాటు చేసుకున్న ఆర్కేకు…తాజా పరిణామాలు నిరాశే కలిగిస్తాయి. ఎల్లకాలం చంద్రబాబు కాలమే నడవదని ఆర్కేకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయి ఉంటుందేమో. చంద్రబాబు రాజకీయాలకే కాదు, తన ఎల్లో జర్నలిజానికి కూడా అస్తమించే కాలం ఆసన్నమైందని ఆర్కే గ్రహించాలి.
‘స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ జరగకూడదు. ఎవరైనా డబ్బు పంపిణీ చేసినట్టు రుజువైతే వారిపై అనర్హత వేటు వేయడంతోపాటు మూడేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టం చేశాం’… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇది! ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఒక కామెంట్ ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే… పత్తిత్తు పరమాన్నం వండితే శుక్రవారం వరకు చల్లబడలేదట!’ అని ఆర్కే రాశారు. అయ్యా ఆర్కే గారూ, ఒకరి వైపు వేలెత్తి చూపితే మిగిలిన నాలుగు వేళ్లు మనవైపు ఉంటాయనే కనీస లాజిక్‌ను మరిస్తే ఎట్లా? మీరు ఇంత కాలం రాసిన, రాస్తున్న రాతలకు, కూస్తున్న కూతలకు కూడా మీరు చెప్పిన పత్తిత్తు సూత్రం వర్తిస్తుందని గుర్తెరిగి మసులు కోవడం మంచిది.